అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతాంః రాహుల్ గాంధీ హామీ

యాత్ర సందర్భంగా మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ భార్యకు పరామర్శ

Rahul Gandhi promises caste census, removal of 50% cap on reservation if INDIA bloc voted to powe

రాంచీ: ఝార్ఖండ్‌లోని రాంచీలో జరుగుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ..లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపిస్తే రిజర్వేషన్లపై ప్రస్తుతమున్న 50 శాతం పరిమితిని ఎత్తేస్తామని హామీ ఇచ్చారు. ఇండియా కూటమి గద్దెనెక్కాక దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని కూడా ఆయన పేర్కొన్నారు. సోమవారం యాత్ర సందర్భంగా ఆయన ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్‌ను పరామర్శించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి గిరిజనుడు కావడంతోనే ఆయన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని బిజెపి కూలదోసేందుకు ప్రయత్నించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘‘ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపైనా బిజెపి దాడి చేస్తోంది. ఇండియా కూటమి ఇలా జరగనివ్వదు. ఝార్ఖండ్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు కాంగ్రెస్, జేఎంఎం నిలబడతాయి. ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాలన్నిటిలో వారు (బిజెపి) దనబలాన్ని, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు’’ అని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రజల్ని ఓట్లు అడిగేటప్పుడు తానో ఓబీసీని అని చెప్పుకునే ప్రధాని మోడీ..కులగణన డిమాండ్ విషయంలో మాత్రం రెండే కులాలున్నాయి..ధనిక,పేద అంటున్నారని విమర్శించారు.