వరదలతో ఢిల్లీ అస్తవ్యస్తం.. కేజ్రీవాల్ ఇంటి సమీపంలోకి వరద నీరు

ప్రమాదస్థాయికి మూడు మీటర్ల పైన ప్రవస్తున్న యమునా నది

raging-yamuna-flowing-at-record-level-spills-onto-streets-in-delhi

న్యూఢిల్లీః వరదలతో అస్తవ్యస్తమైన ఢిల్లీలో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఇప్పటికే ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్న యమునా నది మరింతగా ఉప్పొంగింది. ఫలితంగా రోడ్లు, ఇళ్లు వరదనీటిలో చిక్కుకున్నాయి. ఈ ఉదయం ఏడు గంటలకు హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీలో యుమున నది 208.46 మీటర్ల స్థాయికి చేరుకుంది. నీటిని కిందికి విడిచిపెడుతున్నా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ప్రస్తుతం నది ప్రమాద స్థాయికి మూడు మీటర్ల పైన ప్రవహిస్తోంది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం, ఢిల్లీ అసెంబ్లీ సమీపానికి వరదనీరు చేరుకుంది. అలాగే, సివిల్ లైన్స్ ప్రాంతంలోని రింగ్‌రోడ్డు మునిగిపోయింది. నీటి స్థాయులు పెరుగుతుండడంతో వజీరాబాద్‌లోని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంటును మూసివేశారు. సీఎం కేజ్రీవాల్ నేడు దీనిని సందర్శించే అవకాశం ఉంది. ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను మూసివేస్తున్నట్టు కేజ్రీవాల్ ప్రకటించారు. వరద ప్రాంతాలను ప్రజలు వీలైనంత త్వరగా విడిచి వెళ్లాలని అభ్యర్థించారు. సహాయ కార్యక్రమాల్లో ఉన్న సిబ్బంది, అధికారులకు సహకరించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకోవడమే అన్నికంటే ముఖ్యమని పేర్కొన్నారు.