బీజేపీ ఒత్తిడి కారణంగానే చంద్రబాబు అరెస్ట్ – రఘువీరా

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు ను అరెస్ట్ చేసి జైల్లో వేసిన సంగతి తెలిసిందే. 21 రోజులుగా ఆయన జైల్లోనే ఉన్న ఇంతవరకు బెయిల్ రాలేదు. అసలు వస్తుందో రాదో అనే టెన్షన్ నెలకొని ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఒత్తిడి కారణంగానే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని ఆయన ఆరోపించారు.

జగన్ ప్రభుత్వం భుజంపై తుపాకీ పెట్టి బిజెపి ఈ వ్యవహారాలు నడిపిస్తోందన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులన్నీ కోర్టు పరిధిలోనే ఉన్నాయన్నారు. అక్కడే పరిష్కరించుకోవాలన్నారు. బీజేపీని బలోపేతం చేసేందుకే పురందేశ్వరిని పార్టీ అధ్యక్షురాలిగా నియమించారన్నారు. వీటన్నింటికి కారణం ఏపీలో బీజేపీ బలపడాలన్నదే ఉద్దేశ్యంగా కనిపిస్తోందన్నారు. బీజేపీకి తెలియకుండా, ప్రధాని, హోంమంత్రికి తెలియకుండా ఏపీలో జగన్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేస్తుందని తాము అయితే భావించడం లేదన్నారు. నూటికి నూరుపాళ్లు బీజేపీ ఆశీస్సులతోనే ఇదంతా జరుగుతోందన్నారు.