మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ పవన్ కళ్యాణ్ ఫై రఘురామ ప్రశంసలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రశంసలు కురిపించారు. మీలాంటి ధైర్యమున్న నాయకులకు మాత్రమే సాధ్యం. మీ ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేసారు. నిన్న భీమవరం లో జనసేన జనవాణి కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భాంగా పవన్ కళ్యాణ్ మీడియా తో మాట్లాడుతూ.. భీమవరం లో ప్రధాని సభకు ఆహ్వానం అందిందని.. కానీ రావడం కుదర్లేదన్నారు. అలాగే స్థానిక ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఆహ్వానం అందకపోవడంతో.. తాను వెళ్లడం సరికాదనే ఉద్దేశంతో కార్యక్రమానికి దూరంగా ఉన్నాను అన్నారు. రఘురామను నిర్దాక్షిణ్యంగా అరికాళ్లపై కొట్టించి నడవలేకుండా చేశారని.. ఏ పార్టీలో ఉన్నా విధానాలు బాగోలేనప్పుడు విమర్శలు ఉంటాయని అభిప్రాయపడ్డారు.

రఘురామ సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇది రఘురామపై చేస్తున్న దాడిగా చూడటం లేదని.. క్షత్రియులందరి మీద వైఎస్సార్‌సీపీ చేసిన దాడిగా చూస్తున్నానని వ్యాఖ్యానించారు. రఘురామ తమకు వ్యతిరేకంగా పోటీ చేశారని.. ఆయనది తన కులం కాదు కానీ సాటి మనిషి. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయన్నారు. తాను ఎక్కడికి పారిపోలేదని.. ఇక్కడే అందరికి అండగా ఉంటానని చెప్పడం కోసమే భీమవరం వచ్చానన్నారు. పవన్ కళ్యాణ్ తనకు మద్దతు తెలుపడం పట్ల రఘురామ ట్విట్టర్ వేదిక గా స్పందించారు.

‘సీఐడి పోలీసులు నా పై చేసిన క్రూరమైన దాడిని మీరు ఖండించినందుకు మీకు నా ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు. సీతారామరాజు గారి విగ్రహావిష్కరణకు మీకు ఆహ్వానం ఉన్నప్పటికీ, నా సొంత నియోజకవర్గానికి, విగ్రహ ఆవిష్కరణకు నన్ను రాష్ట్ర ప్రభుత్వం రానివ్వకుండా అడ్డుకున్నందుకు నిరసనగా అంత గొప్ప కార్యక్రమానికి మీరు హాజరుకాకపోవడం మీలాంటి ధైర్యమున్న నాయకులకు మాత్రమే సాధ్యం. మీ ధైర్యానికి హ్యాట్సాఫ్’ అంటూ పోస్ట్ చేసారు.