ఆలయంలో సరిగ్గా పూజలు చేయడం లేదు..అందుకే భారీ వర్షాలు కురిపిస్తున్నా – రంగం భవిష్యవాణి

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో తనకు పూజలు సక్రమంగా నిర్వహించడం లేదని అమ్మవారు భవిష్యవాణిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఆలయంలో సరిగ్గా పూజలు చేయడం లేదు. ప్రతీ ఏడాది మొక్కుబడిగా పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల సంతోషం కోసం పూజలు అందుకుంటున్నా. కానీ ఇష్టపూర్వకంగా పూజలు అందుకోలేకపోతున్నా. ఈ విషయం ప్రతీ ఏడాది నా నోటితో చెప్పించాలనుకుంటున్నారు.

పూజల విషయంలో సంతోషంగా లేనని చెప్పినా…మారడం లేదు. నా బిడ్డలే కదా అని కడుపులో పెట్టుకుంటున్నా. మీ పూజల పట్ల నేను సంతోషంగా లేను. మీ కళ్లు తెరిపించాలనే వర్షాలు కురిపిస్తున్నా. గర్భాలయంలో మొక్కబడిగా పూజలు చేస్తున్నారని వానలు కురిపిస్తున్నా. కొండంత కాకుండా గోరంత ఆగ్రహం చూపిస్తున్నా. అది మీకోసమే. నా గురించి తెలియాలనే. నాకు శాశ్వతరూపం కల్పించండి. భక్తులు నన్ను కనులారా దర్శించుకునేలా ఏర్పాట్లు చేయండి. భక్తులు నా స్థిర రూపాన్ని కన్నులారా వీక్షించాలని నా కోరిక. నా రూపాన్ని స్థిరంగా నిలపాలి. మీరేంటి చేసేది.? నేను తెచ్చుకున్నదే కదా.

దొంగలు దోచినట్లు నాదే మీరు కాజేస్తున్నారు. నా విగ్రహ ప్రతిష్ట కానివ్వండి..మీరు కోరుకున్నది జరపిస్తా..చేస్తా. స్త్రీలు, గర్భిణీలు, ప్రజలందరిని చల్లంగా చూస్తా. వారందరిని కడుపులో పెట్టుుకని కాపాడతా. భక్తులకు ఎలాంటి ఆపద లేకుండా చూస్తా. సంతోషంగా పూజలు అందుకుంటా. ఎన్ని తప్పులు చేసినా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటా అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.