రాధికా శరత్‌కుమార్ ఆస్తి ఎంతో తెలుసా..?

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల నగారా మోగడం తో అన్ని పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. మొత్తం ఏడు దశల్లో ఈసారి పోలింగ్ జరగబోతుంది. ఏప్రిల్ 19 నుంచి ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 04న విడుదలవుతాయి. ఈ క్రమంలో మొదటి దశలో జరగనున్న పోలింగ్ కు సంబదించిన అభ్యర్థులు తమ నామినేషన్ ను దాఖలు చేయడం మొదలుపెట్టారు.

తమిళనాడులో తొలి విడతలోనే లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి నుంచి బలమైన అభ్యర్థులను పార్టీలు బరిలోకి దించాయి. విరుదునగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సినీ నటి రాధికా శరత్‌కుమార్, అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా డీఎండీకే తరఫున దివంగత నటుడు కెప్టెన్, విజయకాంత్ కుమారుడు విజయ ప్రభాకరన్ తలపడుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. అఫిడవిట్‌లో రాధికా మొత్తం రూ.53.45 కోట్ల ఆస్తి ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇక విజయ ప్రభాకరన్ రూ.17.95 కోట్లు ఉన్నట్లు తెలిపారు.

రాధిక సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. తన దగ్గర రూ. 33.01 లక్షల నగదు, 750 గ్రాముల బంగారం, 5 కిలోల వెండి ఆభరణాలు సహా రూ.27,05,34,014 విలువ చేసే చరాస్తులు ఉన్నాయని.. అలాగే రూ.26.40కోట్ల స్థిరాస్తులతో పాటు రూ.14.79కోట్ల అప్పులు ఉన్నాయని ఆమె అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. విజయ ప్రభాకరన్‌ తనకు రూ.17.95కోట్ల సంపద ఉన్నట్లు ప్రకటించారు. రూ.2.50లక్షల నగదు, 192 గ్రాముల బంగారం, 560 గ్రాముల వెండి ఆభరణాలు కలిపి రూ.11.38కోట్ల చరాస్తులు, రూ.6.57కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని వెల్లడించారు. రూ.1.28కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు.