సీఎం జగన్​ను కలిసిన స్టార్ షట్లర్‌ పీవీ సింధు

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు, అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి రజనీ..గురువారం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని కలిశారు. ఇటీవల జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో తొలిసారి సింగిల్స్‌లో పసిడి పతకం గెలిచిన పీవీ సింధు… తాను సాధించిన పతకాలను సీఎంకు చూపించారు. కామన్వెల్త్‌ గేమ్స్‌ మహిళల హాకీలో ఉమెన్స్‌ హాకీ టీమ్ కాంస్య పతకం సాధించగా.. ఇ.రజని గోల్‌ కీపర్‌గా వ్యవహరించారు. హాకీ టీమ్‌ ఆటోగ్రాఫ్‌లతో కూడిన హాకీ స్టిక్, టీమ్‌ టీ షర్ట్‌ను సీఎంకు రజని బహుకరించారు.

ఈ సందర్బంగా సింధు, రజనీలను సీఎం జగన్​ ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను, క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తుందని జగన్ అన్నారు. హాకీ క్రీడాకారిణికి రజనికి ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా జగన్ ను కలిసిన వారిలో రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి ఆర్‌కే రోజా, శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి సహా.. సింధు, రజని కుటుంబ సభ్యులు ఉన్నారు.