బీజేపీ నేత సోనాలి ఫోగట్‌ శరీరంపై గాయాలు..హత్య గా కేసు నమోదు చేసిన పోలీసులు

బిగ్‏బాస్ సీజన్ 14 కంటెస్టెంట్, నటి, బిజెపి నాయకురాలు సోనాలి ఫోగట్ మృతిలో షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. మూడు రోజుల క్రితం ఈమె మృతి చెందగా..గురువారం గోవా మెడికల్‌ కాలేజీలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ రిపోస్టులో ఆమె శరీరంపై అనేక మొద్దుబారిన గాయాలు ఉన్నట్లు తేలింది. దీంతో సోనాలితో పనిచేసే ఇద్దరు సహచరులపై గోవా పోలీసులు హత్యానేరం అభియోగాలు మోపారు. సహాయకులు సుధీర్‌ సగ్వాన్‌, సుఖ్విందర్‌ వాసిని నిందితులుగా చేర్చారు. వెంటనే వీరిని అరెస్టు చేశారు. సోనాలి వెంట గోవా వెళ్లిన ఇద్దరు సహాయకులే ఆమెను హత్య చేసినట్లు మృతురాలి సోదరుడు రింకు ధాక.. పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. చనిపోవటానికి ముందు సోనాలి.. తన తల్లి, సోదరి, బావతో మాట్లాడినట్లు చెప్పారు. సోనాలి మాటల్లో ఆందోళన కనిపించిందని వెల్లడించారు. దీంతో ఇద్దరు సహాయకులపై ఫిర్యాదు చేసినట్లు ఆమె సోదరుడు తెలిపారు.

కాగా హర్యానాలోని హిసార్‌కు చెందిన టిక్‌టాక్‌ స్టార్‌, బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ (42) ఆగస్టు 23న హఠాన్మరణం చెందింది. ఉదయం 9 గంటల సమయంలో గుండెపోటుకు గురైన సోనాలి ఆసుపత్రికి తరలించేలోపు తుదిశ్వాస విడిచారు. అయితే ఆమె మరణం వెనుక హత్య కుట్ర దాగి ఉందని సోనాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సోనాలి పీఏ సుధీర్ సంగ్వాన్‌తోపాటు ఆమెతో సన్నిహితంగా ఉండే సుఖ్వింధర్‌ అనే ఇద్దరు వ్యక్తులే హత్య చేసి ఉంటారని ఆరోపిస్తూ ఆమె సోదరుడు రింకూ ధాకా బుధవారం అంజునా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించారు.