తుమ్మల ఖమ్మం కు చేసిన అభివృద్ధి ఏమీ లేదు – పువ్వాడ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం తో బిఆర్ఎస్ – కాంగ్రెస్ నేతల మధ్య మాటల వార్ రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. ఎవరు కూడా ఎక్కడ తగ్గడం లేదు. విమర్శలు , ప్రతివిమర్శలు , కౌంటర్లు వేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా ఖమ్మంలో పువ్వాడ – తుమ్మల మధ్య వార్ కొనసాగుతుంది. బిఆర్ఎస్ నుండి పువ్వాడ బరిలోకి దిగగా..కాంగ్రెస్ నుండి తుమ్మల దిగాడు. దీంతో ఎక్కడ ప్రజలు ఎవరిని గెలిపిస్తారనేది ఆసక్తి గా మారింది. ఇరువురు ప్రచారంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు.

సోమవారం ప్రచారంలో పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఎన్నెన్నో మాటలు చెబుతున్న కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు.. ఖమ్మం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. అసభ్య పదజాలంతో దూషించడం, అహంకార దర్పాన్ని ప్రదర్శించడం, కాలు మీద కాలు వేసుకొని ప్రజలకు చెప్పులు చూపించడం తప్పా ఆయన మరేమీ చెయ్యలేదని దుయ్యబట్టారు. 2014 వరకు ఖమ్మం ఎమ్మెల్యేగా ఉన్న తుమ్మల.. ఇక్కడి తాగునీటి సమస్యను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. వీటన్నింటి గురించి ప్రజలు ఆలోచించాలని కోరారు.

ఖమ్మం నియోజకవర్గం ఒకప్పుడు ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉందో ఇక్కడి ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. తాను ఖమ్మం ఎమ్మెల్యేగా గెలుపొందే నాటికి ఇక్కడి తాగునీటి సమస్య ఎలా ఉందో తనకు ఇంకా గుర్తే ఉందని అన్నారు. అందుకే ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి నడుం బిగించానని గుర్తుచేశారు. తుమ్మల పదవీకాలం పూర్తయ్యే నాటికి ఖమ్మంలో నాలుగే ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు ఉండేవని, తాను మంత్రిని అయ్యాక వాటి సంఖ్య 24కు పెంచానని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో మిషన్‌ భగీరథ పథకం ద్వారా రూ.350 కోట్లతో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించానని అన్నారు.