చీమ‌ల‌పాడు బాధితుల‌కు తెలంగాణ ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందజేత

జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో ఈ నెల 12న‌ జ‌రిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన మృతుల‌కు, గాయ ప‌డిన వారికి రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్ధిక సహాయాన్ని అందజేసింది. ఈ ఘటన లో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.10 ల‌క్ష‌ల చొప్పున‌, గాయ‌ప‌డిన ఐదుగురికి రూ.2.50 ల‌క్ష‌ల చొప్పున మంగ‌ళ‌వారం రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందజేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఖ‌మ్మం ఎంపీ నామా నాగేశ్వ‌ర రావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయ‌క్‌, ఎమ్మెల్సీ తాతా మ‌ధు, జిల్లా క‌లెక్ట‌ర్ వీపీ గౌతం, సింగ‌రేణి మండ‌ల ఎంపీపీ మాలోత్ శకుంత‌ల‌, చీమ‌ల పాడు స‌ర్పంచ్ మాలోత్ కిశోర్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌ర‌ణించిన న‌లుగురి కుటుంబాలు, గాయ‌ప‌డిన ఐదుగురి కుటుంబాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని విధాల ఆదుకుంటుంద‌న్నారు.

బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళన పేరుతో కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12 న ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమ‌ల‌పాడు వ‌ద్ద నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ స‌మ్మేళనానికి బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు, వైరా ఎమ్మెల్యేతో పాటు ప‌లువురు ప్రజాప్రతినిధులు హాజ‌ర‌య్యారు.

ఈ క్రమంలో నేత‌ల‌ను ఆహ్వానిస్తూ బిఆర్ఎస్ కార్యక‌ర్తలు బాణాసంచా పేల్చారు. దీంతో ఆ నిప్పుర‌వ్వలు ఎగిరిప‌డి స‌భా ప్రాంగ‌ణానికి 200 మీట‌ర్ల దూరంలో ఉన్న గుడిసెపై ప‌డ్డాయి. దీంతో గుడిసెలో ఉన్న గ్యాస్ సిలిండ‌ర్‌కు మంట‌లు అంటుకుని అది పేలిపోయింది. దీంతో అక్కడ ఉన్న వారంతా ప్రమాదానికి గురయ్యారు. ఘటనా స్థలంలో రమేశ్, మంగు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. పలువురు గాయపడ్డారు.