ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ముగించాలనుకుంటున్న పుతిన్‌!

అన్ని సాయుధ ఘర్షణలు దౌత్య మార్గంలోనే ముగుస్తాయన్న పుతిన్

putin-says-wants-to-end-ukraine-war

మాస్కోః రష్యా-ఉక్రెయిన్ మధ్య పది నెలలుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరిలో మొదలైన ఈ యుద్ధం కారణంగా ఇరువైపులా భారీ నష్టం జరుగుతోంది. ప్రపంచం మొత్తం రష్యాపై వేలెత్తి చూపిస్తున్న వేళ పుతిన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు.

తాజాగా పుతిన్ మాట్లాడుతూ.. దౌత్యపరమైన చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలకాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. శత్రుత్వం తీవ్రత భరించలేని నష్టాలకు దారితీస్తుందని తాను ఇప్పటికే పలుమార్లు చెప్పినట్టు పుతిన్ గుర్తు చేశారు. అన్ని సాయుధ ఘర్షణలు దౌత్య మార్గంలో ఏదో ఒకరమైన చర్చల ద్వారానో, లేదంటే మరోలానో ముగుస్తాయని పుతిన్ అన్నారు.

మరోవైపు, తాము చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నప్పటికీ ఉక్రెయిన్ మాత్రం వ్యతిరేకిస్తోందని రష్యా చెబుతోంది. అయితే, ఉక్రెయిన్ వాదన మరోలా ఉంది. చర్చలు జరగాలంటే తొలుత దాడులు ఆపి, తమ నుంచి స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని తిరిగి అప్పగిస్తే అప్పుడు చూద్దామని ఉక్రెయిన్ చెబుతోంది.

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతో వైట్‌హౌస్‌లో సమావేశమైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ తర్వాతి రోజునే పుతిన్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/