ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టగానే..జగన్ సర్కార్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసిన పురంధేశ్వరి

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన పురంధేశ్వరి..బాధ్యతలు చేపట్టగానే జగన్ సర్కార్ ఫై నిప్పులు చెరిగారు. గురువారం ఉదయం హైదరాబాద్‌ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరుకున్న పురంధేశ్వరికి బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్ నుంచి భారీ ర్యాలీతో ఏపీ బీజేపీ చీఫ్‌ బీజేపీ పార్టీ ఆఫీస్‌కు చేరుకున్నారు. బీజేపీ పార్టీ ఆఫీస్ వద్ద కూడా బాణాసంచాతో పురంధేశ్వరికి బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం ఏపీ బీజేపీ అధ్యక్షురాలికి పురంధేశ్వరి బాధ్యతలు స్వీకరించే కార్యక్రమం జరిగింది.

అనంతరం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ…బీజేపీ అవినీతికి దూరంగా ఉండే పార్టీ.. బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. నా మీద నమ్మకం విశ్వాసంతో ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించినందుకు ధన్యవాదాలు అన్నారు. ఏపీలో బీజేపీ అన్ని విధాలా సహకారం అందించిందని చెప్పుకొచ్చారు. బీజేపీ అందించిన సహకారం ఎలాంటిదో చూడాలన్నారు. ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. కేంద్రం చలవతోనే రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి చెందాయన్నారు.

జాతీయ రహదారులు 8623 కిలో మీటర్ల నిర్మాణాలకు రూ.1 లక్షా 15 వేల కోట్లు కేంద్రం కేటాయించిందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ రహదారులు వేసిందో సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్ధితి ప్రజలందరికీ తెలుసన్నారు. ఏపీ డివిజన్ యాక్ట్ ప్రకారం రెండేళ్లలోనే జాతీయ విద్యాసంస్ధలన్నీ కేంద్రం ఏపీలో నిర్మించిందన్నారు. ఎయిర్ పోర్టుల విస్తరణను కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఏపీలో అభివృద్ధి జరిగిందన్నారు. విజయవాడ ఎయిర్‌పోర్టు విస్తరణ, పలు ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల స్ధాపనకు ప్రభుత్వం కృషి చేయలేదని విమర్శించారు. పెట్టుబడులు రాష్ట్రానికి రావడం లేదని.. ఉన్నవి తరలిపోతున్నాయని పురంధేశ్వరి వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని నిమ్స్‌ను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో నిన్న ఉన్నాం.. మొన్న ఉన్నాం.. రేపూ ఉంటామని పొత్తు ఫై క్లారిటీ ఇచ్చారు.