కేసీఆర్‌తో పంజాబ్ సీఎం భేటీ

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నేడు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. ప్రగతి భవన్ కు చేరుకున్న భగవంత్ మాన్ కు కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. శాలువా కప్పి వీణ బొమ్మను బహూకరించారు. అటు, భగవంత్ మాన్ కూడా కేసీఆర్ కు శాలువా కప్పి ఓ కానుక అందజేశారు. ఈ భేటీ లో దేశంలోని ప్ర‌స్తుత రాజ‌కీయాల‌తో పాటు ప‌లు అంశాల‌పై చ‌ర్చిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇటీవల ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం కావడం, పార్టీ కార్యాచరణ వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.

అటు, పంజాబ్ లో పరిస్థితులను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న రైతు వ్య‌తిరేక నిర్ణ‌యాలు, ఇత‌ర అంశాల‌పై చ‌ర్చిస్తున్నారు. బీజేపీపై పోరాటం విష‌యంలో కేసీఆర్‌కు ప‌లువురు నేత‌లు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. కాగా, ఈ నెల 24న పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ సర్దార్ కుల్తార్ సింగ్ సంధ్వాన్, డిప్యూటీ స్పీకర్ జైకిషన్ సింగ్ రౌరీ తదితరులు కూడా హైదరాబాద్ రానున్నారు. వారు కూడా సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.