తిరుమల శ్రీవారికి 4 కిలోల బంగారాన్ని అందజేసిన భక్తురాలు

కరోనా తర్వాత మళ్లీ తిరుమల ఆదాయం భారీగా పెరుగుతుంది. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడం, భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తుండడం టీటీడీ హుండీకి కోట్ల ఆదాయం వస్తుంది. రీసెంట్ గా తమిళనాడు కు చెందిన ఓ భక్తుడు ఏకంగా ఏడు కోట్లను అందజేసి వార్తల్లో నిలువగా, తాజాగా మరో భక్తురాలు 4 కిలోల బంగారాన్ని తిరుమల శ్రీవారికి సమర్పించింది.

చెన్నైకి చెందిన సరోజా సూర్యనారాయణ అనే భక్తురాలు.. దాదాపు 2.45 కోట్ల రూపాయల విలువజేసే 4 కిలోల బంగారాన్ని శ్రీవారికి విరాళంగా ఇచ్చి ఏడుకొండల స్వామిపై తనకున్న భక్తిని చాటుకున్నారు. వజ్రాలు అమర్చిన 4 వేల 150 గ్రాముల బంగారం యజ్ఞోపవీతం, లక్ష్మీ కాసుల హారాన్ని స్వామివారికి కానుకగా సమర్పించారు. చైన్నై నగరంలో రూ.3.50 కోట్లు విలువజేసే తన స్థలాన్ని కూడా విరాళంగా అందజేశారు సరోజా. ఇక.. శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈఓ ధర్మారెడ్డికి ఆస్తి పత్రాలు, బంగారు ఆభరణాలను అందించారు.

నాల్గు రోజుల క్రితం తిరున‌ల్వేలికి చెందిన గోపాల బాల‌కృష్ణన్ ఒక్క‌రే స్వామివారికి రూ.7 కోట్ల విరాళం అందించారు. అన్న‌దానం స‌హా టీటీడీ నిర్వ‌హ‌ణ‌లోని 7 ట్రస్టుల‌కు రూ.1 కోటి చొప్పున ఆయ‌న‌ విరాళం అందించారు. విద్యాదాన ట్రస్టుకు ఏ స్టార్ టెస్టింగ్ అండ్ ఇన్సెక్ష‌న్ సంస్థ రూ.1 కోటి విరాళాన్ని అందించింది. శ్రీవాణి ట్ర‌స్టుకు బాల‌కృష్ణ ఫ్యూయ‌ల్ స్టేష‌న్ సంస్థ రూ.1 కోటి విరాళం స‌మ‌ర్పించింది. ఎస్వీ వేద ప‌రిర‌క్ష‌ణ సంస్థ‌కు సీ హ‌బ్ ఇన్సెక్ష‌న్ స‌ర్వీసెస్ సంస్థ రూ.1 కోటి విరాళం అందించింది. మొత్తంగా ఒకే రోజు వ్య‌క్తిగ‌త హోదాల్లో న‌లుగురు భ‌క్తులు స్వామి వారికి ఏకంగా రూ.10 కోట్ల విరాళాన్ని అందించారు. ప్రస్తుతం తిరుమలాల భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. సర్వదర్శనానికి 24 గంటలు పడుతుంది.