కాల్పుల్లో మృతి చెందిన రైతు కుటుంబానికి కోటి, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించిన సీఎం

CM Bhagwant Mann

న్యూఢిల్లీ: ఈనెల 21వ తేదీన క‌న్నౌరి బోర్డ‌ర్ వద్ద జ‌రిగిన కాల్పుల్లో మృతిచెందిన రైతు శుభ్‌క‌ర‌ణ్ సింగ్ కుటుంబానికి పంజాబ్ సీఎం భ‌గ‌వంత్‌మాన్ సింగ్ న‌ష్ట‌ప‌రిహారాన్ని ప్ర‌క‌టించారు. కోటి రూపాయ‌ల న‌గ‌దుతో పాటు కుటుంబ‌స‌భ్యుల‌కు ఒక ప్ర‌భుత్వ ఉద్యోగాన్ని ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. శుభ్‌క‌ర‌ణ్ మృతికి కార‌ణ‌మైన పోలీసుపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న అన్నారు. రైతు శుభ్‌క‌ర‌ణ్ ప‌బ్లిసిటీ కోసం ఆందోళ‌న‌ల్లో పాల్గొనేందుకు రాలేద‌ని, వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర డిమాండ్ చేసేందుకు వచ్చినట్లు సీఎం భ‌గ‌వంత్‌మాన్ వెల్ల‌డించారు. రైతులకు పంజాబ్ ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు.

రాష్ట్ర‌ప‌తి పాల‌న విధిస్తామ‌ని మ‌మ్ముల్ని బెదిరిస్తున్నార‌ని, ఆ బెదిరింపుల‌కు తానేమీ బెదిరేది లేద‌న్నారు. మ‌రో శుభ్‌క‌ర‌ణ్ మృతిచెంద‌కుండా చూస్తాన‌ని సీఎం భ‌గ‌వంత్‌మాన్ అన్నారు. మ‌మ్ముల్ని బెదిరించ‌డానికి ముందు మ‌ణిపూర్‌, నుహ్ గురించి ఆలోచించాల‌న్నారు. శాంతి భ‌ద్ర‌త‌లు స‌న్న‌గిల్ల‌డానికి హ‌ర్యానా పోలీసులే కార‌ణ‌మ‌ని తెలిపారు. ఎవ‌రికీ ఎటువంటి ట్ర‌బుల్ ఇవ్వ‌డం లేద‌న్నారు. త‌మ అహంకారాన్ని ప‌క్క‌న పెట్టి, రైతుల డిమాండ్ల‌ను పూర్తి చేయాల‌ని ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరారు.