అలిపిరిలో గోవిందా….గోవిందా.. అంటూ భక్తుల నిరసన

తిరుమలకు అనుమతించాలంటూ బైఠాయింపు

protest of the devotees in Alipiri
protest of the devotees in Alipiri

తిరుమల: ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి,ద్వాదశి గడి యలకు ముందే కలియుగప్రత్యక్షదైవం శ్రీవేంక టేశ్వరస్వామి దర్శనానికి భక్తులు గగ్గోలుపెడు తున్నారు. తమను తిరుమలకు ఎందుకు అను మతించబోరంటూ వేలాదిమంది భక్తులు కన్నీటిప ర్యంతమై తిరుపతి అలిపిరిలో గరుడసర్కిల్‌వద్ద భక్తులు ఆందోళన చేపట్టారు.

దీంతో ఉద్రిక్తత నెలకొంది. వేలాది సంఖ్యలో భక్తులు దర్శనాలకు సంబంధించి ఎలాంటి టిక్కెట్లు, టోకెన్లు లేకుండా కాలినడకన తిరుమలకు అనుమతించాలని పట్టుబట్టడం, ఏకంగా ఆందోళనకు దిగడం అటు టిటిడి వర్గా లను ఇటు భక్తులను గందరగోళంలో నెట్టేసింది. దాదాపు గంటసమయంపైగా భక్తులు అలిపిరి గరుడసర్కిల్‌ వద్దరోడ్డుపై బైఠాయించి తమను కొండకు అనుమతించాలని, దర్శనం కల్పించాలని నిరసనకు దిగారు.

భక్తులందరినీ సంయమనంతో పోలీసులు, టిటిడి విజిలెన్స్‌ సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా మొండిపట్టు వీడలేదు. తమను అనుమతిం చా లని మంకుపట్టుపట్టారు. దీంతో గంటకుపైగా సం యమనంతో సర్దిచెప్పినా వినిపించుకోని భక్తులను పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది దూరంగా నెట్టే శారు.

సోమవారం సాయంత్రానికి ఈనెల 24 వరకు దర్శనాలకు సంబంధించి ఉచిత సర్వ దర్శనం టోకెన్లు జారీచేసేయడంతో ఆపై 25,26 తేదీల్లో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ఏకాదశి, ద్వాదశి రోజు నుంచి 2021 జనవరి 3వతేదీ వరకు తిరుపతి స్థానికులకు తప్ప బయటివ్యక్తులకు, స్థానికేతరులకు దర్శనం కేటాయించడంలేదు. పూర్తిగా ఆప్‌లైన్‌లో నిలుపు దలచేసిన విషయం విదితమే. అయితే తమిళ నాడు,కర్నాటక, తెలంగాణా రాష్ట్రాల నుంచి భారీగా వచ్చిన భక్తులు తిరుపతి అలిపిరిలోనే తిష్టవేశారు. చివరకు దర్శన టోకెన్లు లేకపోవ డంతో ఆందోళనకు దిగారు. ఈ కారణంగా తిరుమలకు ప్రవేశద్వారం అలిపిరి గరుడసర్కిల్‌ వద్ద దాదాపు అర్ధగంటకుపైగా వాహనాలు ఆగిపోయి బారులుతీరాయి. ట్రాఫిక్‌ స్తంభించింది. శ్రీవారి భక్తులకు టిటిడి, పోలీసు అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు.

ఇకచేసేది లేక భక్తులను అక్కడ నుంచి దూరంగా నెట్టేసే పరిస్థితి ఎదురైంది. అయితే భక్తులు మాత్రం తమపట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, కనీసం మహిళలని కూడా చూడకుండా లాగేశారని ఆరోపణలు చేశారు. తమ దేవుడు ఏడుకొండలవాని దర్శనానికి వస్తే పోలీసులు ఇలానే వ్యవహరిస్తారా అంటూ కొందరు భక్తులు విమర్శలు గుప్పించారు. గోవిందా….గోవిందా అంటూ నినాదాలతో తమ నిరసన తెలిపారు. చివరకు అక్కడ నుంచి వెనుదిరగడం తప్ప ఆందోళన చేసిన భక్తులకు లాభం ఏమీలేకపోయింది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/