మరోసారి ప్రియాంక గాంధీని అడ్డుకున్న యూపీ పోలీసులు

లక్నో: ఉత్తరప్రదేశ్‌ పోలీసులు మరోసారి కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని అడ్డుకున్నారు. ఆగ్రాలో పోలీస్‌ కస్టడీలో మరణించిన వ్యక్తి కుటుంబాన్ని కలిసేందుకు బుధవారం ఆమె వెళ్తున్న వాహనాన్ని నిలిపివేశారు. లఖింపూర్‌ ఖేరీ ఘటనలో హత్యకు గురైన బాధిత రైతు కుటుంబాలను పరిమర్శించేందుకు ప్రియాంక గాంధీ వెళ్లగా నాడు పోలీసులు అడ్డుకున్నారని, ఇప్పుడు కూడా మరో బాధిత కుటుంబాన్ని కలిసేందుకు ఆమె వెళ్తున్న వాహనాన్ని ముందుకు కదలనీయలేదని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. అవసరమైన అనుమతులు లేనందునే ప్రియాంక గాంధీని నిలువరించినట్లు యూపీ పోలీసులు తెలిపారు. అయితే తాను ఎక్కడికి వెళ్లాలన్నా పరిమిషన్‌ తీసుకోవాలా అని ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

కాగా, రూ.25 లక్షలు చోరీ చేసిన ఆరోపణలతో అరెస్ట్‌ అయిన అరుణ్ అనే వ్యక్తిని జగదీష్‌పురాలోని పోలీస్ స్టేషన్‌లో ఇంటరాగేషన్‌ చేస్తుండగా ఆరోగ్యం క్షీణించి మరణించినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి అతడ్ని ఇంటి నుంచి అరెస్ట్‌ చేయగా అనారోగ్యంతో ఉండటంతో ఆసుపత్రికి తరలించామని, అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు చెప్పారని ఆగ్రా సీనియర్‌ పోలీస్‌ అధికారి వెల్లడించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/