15 మంది టీచర్లపై గ్యాంగ్ రేప్ ఆరోపణలు!

ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్లలో ఐదుగురు ఉపాధ్యాయినులు

జైపూర్: అల్వార్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్‌తోపాటు 15 మంది టీచర్లు తమపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు ఐదుగురు విద్యార్థినులు ఆరోపించారు. అత్యాచారానికి పాల్పడుతున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 మంది టీచర్లలో ఐదుగురు ఉపాధ్యాయినులు కూడా ఉండడం గమనార్హం. వీరి సాయంతోనే మిగతా వారు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. అంతేకాదు, ఆ ఘటనను వారు వీడియో కూడా తీశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధిత విద్యార్థినులు ఆరోపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. దీనిని ‘ప్రతీకారం.. సాక్షుల వేధింపు’ కేసుగా అనుమానిస్తున్నారు.

ఆరోపణలు వచ్చిన పాఠశాలకు చెందిన ఓ మాజీ ఉపాధ్యాయుడు ముగ్గురు విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై గతేడాది డిసెంబరులో అరెస్ట్ అయ్యారు. దీంతో ఆయన సస్పెండ్ అయ్యారు. ఆయనకు వ్యతిరేకంగా పాఠశాల సిబ్బంది వాంగ్మూలం ఇచ్చారు. ఇటీవల బెయిలుపై విడుదలైన ఉపాధ్యాయుడు మంగళవారం రాత్రి విద్యార్థినులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు.

తమపై అత్యాచారానికి పాల్పడినట్టుగా ఆరోపిస్తున్న విద్యార్థులు ఆ సమయంలో పోలీస్ స్టేషన్ బయటే ఉండగా, సస్పెండైన మాజీ ఉపాధ్యాయుడు ఒక్కరే వెళ్లి ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేసు పెట్టిన ఐదుగురు విద్యార్థినుల కుటుంబాలను సస్పెండైన ఉపాధ్యాయుడు ప్రేరేపించి ఈ కేసు పెట్టించినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అయితే, కింది తరగతులకు చెందిన మరో ముగ్గురు విద్యార్థినులు కూడా టీచర్లపై ఇలాంటి ఆరోపణలే చేయడంతో కేసు విచారణ కీలకంగా మారింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/