నేడు తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని మోడీ

Prime Minister Modi will visit Telangana today

హైదరాబాద్ః లోక్‌సభ ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణ‌లో బీజేపీ ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసింది. దీనిలో భాగంగా మంగ‌ళ‌వారం ప్రధాని న‌రేంద్ర మోడీ ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం రాష్ట్రానికి వ‌స్తున్నారు. జ‌హీరాబాద్ ఎంపీ అభ్య‌ర్థి బీబీ పాటిల్, మెద‌క్ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్‌రావుకు మ‌ద్ధ‌తుగా ప్ర‌ధాని ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొననున్నారు.

తెలంగాణ‌లో రోజు ప్రధాని మోడీ షెడ్యూల్ వివరాలు..

ప్రధాని మోడీ మంగళవారం సాయంత్రం 4:20 గంటలకు హెలికాప్టర్‌లో జహీరాబాద్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి జహీరాబాద్-మెదక్ జనసభ ప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం 4:30 గంటల నుంచి 5:20 వరకు ప్ర‌జాస‌భ‌లో ప్రసంగిస్తారు. ఈ సభ ముగిసిన త‌ర్వాత‌ 5:30 గంటలకు జహీరాబాద్ నుంచి దుండిగల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు.

కాగా, మే 3, 4వ తేదీల్లో ప్ర‌ధాని తెలంగాణ‌లో పర్య‌టిస్తార‌ని మొద‌ట బీజేపీ వ‌ర్గాలు పేర్కొన్నాయి. కానీ, ఈ తారీఖుల్లో మోడీ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. మే 8, 9 తేదీల్లో ప్ర‌ధాని రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది. మే 8న వేముల‌వాడ‌లో జ‌రిగే భారీ బ‌హిరంగ స‌భ‌కు హాజ‌రవుతార‌ని స‌మాచారం.

మరోవైపు మే 1న హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. చార్మినార్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని గౌలిపురలో సాయంత్రం 5 గంటలకు నిర్వ‌హించే రోడ్ షోలో ఆయ‌న పాల్గొన‌నున్నారు. లాల్‌దర్వాజా అమ్మవారి ఆలయం నుంచి శాలిబండ సుధా థియేటర్ వరకు అమిత్ షా రోడ్ షో కొన‌సాగ‌నుంది. వచ్చే నెల 5న సైతం నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి అభ్యర్థులకు మద్దతుగా అమిత్ షా ఆయా నియోజకవర్గాల‌లో పర్యటిస్తార‌ని స‌మాచారం.