విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా

దేశంలోనే అత్యున్నత పదవి అయిన భారత రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు రాష్ట్రపతి ఎన్నికలపైనే ఫోకస్ చేసాయి. కాగా విపక్ష పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలబెట్టాలని అనుకున్నాయి. కానీ ఇది సెట్ అవ్వడం లేదు. ప్రతిపాదించిన ప్రతి ఒక్కరు తప్పుకోవడం తో విపక్ష పార్టీల నేతలకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లాలు విముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా, రాష్ట్రపతిగా పోటీ చేయాలని విపక్షాలు చేసిన విన్నపాన్ని మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ సున్నితంగా తిరస్కరించారు.

దీంతో కొత్త అభ్యర్థి కోసం విపక్షాలు అన్వేషిస్తుండగా.. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా పేరు తెరపైకి వచ్చింది. మంగళవారం విపక్షాలతో శరద్‌ పవార్‌ నిర్వహిస్తున్న సమావేశంలో యశ్వంత్‌ సిన్హా పేరును ప్రకటించే అవకాశం ఉంది. యశ్వంత్ గత ఏడాది పశ్చిమ్ బెంగాల్ ఎన్నికలకు ముందే బీజేపీని వీడి తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో సిన్హాకు ఇప్పటికే కొన్ని పార్టీలు మద్దతు పలికాయనీ, ఆయన అభ్యర్థిత్వంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా సుముఖంగా ఉన్నారని టీఎంసీ సీనియర్‌ నేత ఒకరు వెల్లడించారు. మాజీ ఐఏఎస్‌ అధికారి అయిన సిన్హా 1984లో జనతాదళ్‌లో ద్వారా రాజకీయ అరంగేట్రం చేసి, తర్వాత బీజేపీలో చేరారు. ప్రస్తుతం టీఎంసీ ఉపాధ్యక్షునిగా కొనసాగుతున్నారు.