ఎర్ర‌కోట హింస కేసులో మ‌రో ఇద్ద‌రు అరెస్ట్‌

దేశం విడిచి పారిపోతుండగా పట్టుకున్న పోలీసులు

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం నాడు రైతు సంఘాల ట్రాక్టర్ ర్యాలీలో ఎర్రకోట వద్ద హింసకు పాల్పడిన ఘటనకు సంబంధించి మరో ఇద్దరిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగ పత్రాలు సృష్టించి దేశం విడిచి పారిపోవాలనుకున్న భారత సంతతి డచ్ దేశస్థుడు సహా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మణీందర్ జీత్ సింగ్, ఖేమ్ ప్రీత్ సింగ్ లను అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు.

డచ్ దేశస్థుడైన మణీందర్ జీత్ సింగ్ మామూలుగానే నేరస్థుడని చెప్పారు. బ్రిటన్ లోని బర్మింగ్ హాంలో ఉంటున్నాడన్నారు. గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన హింసలో అతడికీ హస్తం ఉందని, నకిలీ పత్రాలు సృష్టించి దేశం విడిచి పారిపోతుండగా ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుకున్నామని తెలిపారు. మరో నిందితుడు ఖేమ్ ప్రీత్ సింగ్.. ఎర్రకోటలో డ్యూటీ చేస్తున్న పోలీసులపై బల్లెంతో దాడి చేశాడని చెప్పారు. వీరి అరెస్టులతో కేసులో అరెస్టైన వారి సంఖ్య 14కు చేరింది.

కాగా, గ‌త జ‌న‌వ‌రి 26న రైతుల ట్రాక్ట‌ర్ ర్యాలీ సంద‌ర్భంగా ఢిల్లీలోని ఎర్ర‌కోట వ‌ద్ద హింస చెల‌రేగిన‌ప్ప‌టి నుంచి పోలీసులు ఢిల్లీ, పంజాబ్‌లో నిందితుల కోసం గాలింపులు చేప‌ట్టారు. సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితుల‌ను గుర్తించి వారి జాడ కోసం గాలిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ఇద్ద‌రు నిందితులు పట్టుబ‌డ్డారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/