హైదరాబాద్ లో భారీ వర్షం..

నైరుతి రుతుపవనాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్ మహానగరంలో అర్ధరాత్రి 11 గంటల నుండి తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయం కాగా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రజలు ఎవ్వరు కూడా బయటకు రావొద్దంటూ GHMC హెచ్చరిక జారీచేసింది. బేగంపేట, ఎర్రగడ్డ, సోమాజిగూడ, ఖైరతాబాద్‌, అమీర్​పేట, నాగారం, షేక్​పేట, గోల్కొండ, టోలీచౌకి, మెహాదీపట్నం, బోయిన్‌పల్లి, అల్వాల్‌, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, ప్యారడైజ్‌, చిలకలగూడ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అలాగే ఏపీలోని రాయలసీమను విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వైఎస్సార్‌ జిల్లాలో అనూహ్యంగా సాధారణ వర్షపాతం కంటే 108.7 శాతం అధికంగా పడింది. శ్రీ సత్యసాయి జిల్లాలో 102.9 మి.మీ. (94.9 శాతం అధికం) కురిసింది. అనంతపురం జిల్లాలో 62.5 శాతం , అన్నమయ్య జిల్లాలో 69.5 శాతం అధికం, చిత్తూరు జిల్లాలో 49.5 శాతం అధికం వర్షపాతం కురవాల్సిన దానికన్నా ఎక్కువ కురిసింది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ.. పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో సాధారణ వర్షం కురిసింది.