వైసీపీ ఎమ్మెల్యేకు టీచర్ కొలువు ..

అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి టీచర్ కొలువు దక్కింది. ఆంధ్రప్రదేశ్ లో 1998 డీఎస్సీ అభ్యర్థులకు చిక్కులు తొలగిపోయాయి.. కోర్టు వివాదాలు పరిష్కారం కావడంతో ఇప్పుడు ఉద్యోగాలు దక్కాయి. లేటు వయసులో చాలామందికి టీచర్ జాబ్స్ రావడంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ జాబితాలో అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా చేరారు. ఆయన కూడా 1998 డీఎస్సీలో ఎంపికయ్యారు. రాజకీయాల్లోకి రాకముందు.. సుమారు పాతికేళ్ల క్రితం ధర్మశ్రీ డీఎస్సీ రాసి అర్హత సాధించారు. ఇప్పుడు ఆయనకు టీచర్‌గా ఉద్యోగ అవకాశం వచ్చింది. ఈ విషయం తెలియడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

తాను టీచర్‌గా ఎంపిక కావడంపై ఎమ్మెల్యే ధర్మశ్రీ మాట్లాడుతూ.. డీఎస్సీ రాసినప్పుడు తన వయసు 30 సంవత్సరాలని గుర్తు చేసుకున్నారు. మద్రాసు అన్నామలై యూనివర్సిటీలో బీఈడీ చదివానని, ఉపాధ్యాయుడిగా స్థిరపడాలని అనుకున్నానని పేర్కొన్నారు. 1998 డీఎస్సీ వివాదాల్లోకి జారుకోవడంతో ఆ తర్వాత బీఎల్ అభ్యసించడం మొదలుపెట్టినట్టు చెప్పారు.

ఆ సమయంలోనే కాంగ్రెస్‌లో చేరి పార్టీ జిల్లా యువజన విభాగంలో పనిచేసినట్టు చెప్పారు. అప్పుడే కనుక తనకు ఉద్యోగం వచ్చి ఉంటే ఉపాధ్యాయుడిగా స్థిరపడి ఉండేవాడినని అన్నారు. డీఎస్సీ 1998 బ్యాచ్ తరపున సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు.