రాహుల్ గాంధీపై మరో కేసు నమోదు

rahul-gandhi

న్యూఢిల్లీః కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో ఎంపీ పదవి కోల్పోయిన రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు నమోదైంది. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ కోర్టులో ఆర్ఎస్ఎస్ కార్యకర్త కమల్ భదౌరియా పరువు నష్టం దావా కేసును వేశారు. దీనిపై ఏప్రిల్ 12న కోర్టులో విచారణ జరగనుంది.

భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ అనేక బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఓ సభలో ప్రసంగిస్తూ.. ఆర్ఎస్ఎస్పై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఆర్ఎస్ఎస్ వారిని 21వ శతాబ్దపు కౌరవులుగా రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై హరిద్వార్ కోర్టులో పరువునష్టం పిటిషన్ దాఖలైంది.

జనవరి 9 2023న హర్యానాలోని అంబాలాలో భారత్ జోడో యాత్ర ముగిసిన తర్వాత స్ట్రీట్-కార్నర్ సమావేశంలో రాహుల్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులు 21వ శతాబ్దపు కౌరవులు” అని వ్యాఖ్యానించారు. “కౌరవులు ఎవరంటే…? నేను ముందుగా మీకు 21వ శతాబ్దపు కౌరవుల గురించి చెబుతాను. వారు ఖాకీ హాఫ్ ప్యాంట్‌లు ధరిస్తారు. చేతిలో లాఠీలు పట్టుకుని, శాఖలు నిర్వహిస్తారు. భారతదేశంలోని 2-3 బిలియనీర్లు కౌరవులు ఉన్నారు..” అని రాహుల్ గాంధీ అన్నారు.