అంబేద్క‌ర్ 133వ జ‌యంతి.. నివాళులు అర్పించిన రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని

president-murmu-and-pm-modi-paid-floral-tributes-on-the-eve-of-ambedkar-jayanti

న్యూఢిల్లీః భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ 133వ జ‌యంతి సంద‌ర్భంగా ఈరోజు ఢిల్లీలో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము, ప్ర‌ధాని మోడీ నివాళులు అర్పించారు. పార్ల‌మెంట్ హౌజ్ లాన్‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూల మాల వేసి.. ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన బౌద్ధ భిక్షువుల‌కు కూడా పుష్ప‌గుచ్ఛం స‌మ‌ర్పించారు. బాబా సాహెబ్ డాక్ట‌ర్ అంబేద్క‌ర్ 1891, ఏప్రిల్ 14వ తేదీన జ‌న్మించారు.

ఈ కార్య‌క్ర‌మంలో మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్‌, కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే, ఆ పార్టీ మాజీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్‌తో పాటు ఇత‌ర నేత‌లు కూడా పాల్గొన్నారు. అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి ముర్ము త‌న ట్విట్ట‌ర్‌లో సందేశం పోస్టు చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా దేశ ప్ర‌జ‌లంద‌రికీ హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలిపారు.

కాగా, జ్ఞానానికి, మేధ‌స్సుకు అంబేద్క‌ర్ ఓ సింబ‌ల్ అని రాష్ట్ర‌ప‌తి ముర్ము అన్నారు. విద్యావేత్త‌గా, న్యాయ నిపుణుడిగా, ఆర్థిక‌వేత్త‌గా, రాజ‌కీయ‌వేత్త‌గా, సామాజిక‌వేత్త‌గా దేశ సంక్షేమం కోసం విప‌త్క‌ర‌ప‌రిస్థితుల్లోనూ ప‌నిచేశార‌న్నారు. అణ‌గారిన వ‌ర్గానికి విద్య‌ను అందించి, వారిని ప్ర‌ధాన ప్ర‌జాజీవన క్షేత్రంలోకి తీసుకురావాల‌ని అంబేద్క‌ర్ ప్ర‌య‌త్నించిన‌ట్లు ముర్ము అన్నారు. ఆర్ధిక‌, సామాజిక స‌మాన‌త్వం కోసం ఆయ‌న క‌ట్టుబ‌డి ఉన్న తీరు అది ప్ర‌జాస్వామ్యానికి వెన్నుముక‌గా నిలుస్తుంద‌ని ఆమె అన్నారు.