భారత్ పై ప్రపంచదేశాలన్నీ ఆధారపడే పరిస్థితి వచ్చిందిః రాష్ట్రపతి

President Droupadi Murmu addresses both Houses of Parliament

న్యూఢిల్లీః కేంద్ర బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయని ఆమె అన్నారు. ఆత్మనిర్బర్తో ఆధునిక భారత నిర్మాణం జరుగుతోందని అభిప్రాయపడ్డారు. పేదలు లేని భారత్ కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న ఆమె.. యువ, మహిళా శక్తి దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

అవినీతి లేని దేశం వైపు భారత్ అడుగులేస్తోందని ముర్ము చెప్పారు. దేశాభివృద్ధిలో రానున్న పాతికేళ్లు అత్యంత కీలకమని అన్నారు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న భారత్ పై ప్రపంచదేశాలన్నీ ఆధారపడే పరిస్థితి వచ్చిందని చెప్పారు.75ఏండ్ల స్వాతంత్ర్య ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో ఆర్టికల్ 370 నుంచి ట్రిపుల్ తలాక్ వరకు స్థిర నిర్ణయాలతో తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని ముర్ము అభిప్రాయపడ్డారు. 9ఏండ్ల పాలనలో ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని ముర్ము, పౌరులందరి అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ముర్ము స్పష్టంచేశారు. ‘‘డిజిటల్‌ ఇండియా దిశగా భారత్‌ ముందుకెళ్తోంది. సాంకేతికతను అందిపుచ్చుకొని నూతన ఆవిష్కరణలు తీసుకొస్తున్నాం. ఆయుష్మాన్‌ భారత్‌ వంటి మెరుగైన పథకాలు తీసుకొచ్చాం. మాది ప్రజల ఆత్మవిశ్వాసం పెంచే ప్రభుత్వం. రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం. అవినీతి అంతం దిశగా దేశం అడుగులేస్తోంది. విధాన లోపాన్ని వీడి దేశం.. ముందడుగు వేస్తోంది. ప్రపంచానికి పరిష్కారాలు చూపేలా భారత్ తయారైంది’’ అని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు.