రాహుల్‌ గాంధీపై పరువు నష్టం కేసు.. నేడు తీర్పు వెలువరించనున్న గుజరాత్‌ హైకోర్టు

Gujarat High Court verdict on Rahul Gandhi’s plea in Modi surname case today

అహ్మదాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ రాజకీయ భవితవ్యం ఈరోజు తేలనుంది. మోడీ ఇంటిపేరు కేసులో గుజరాత్‌ హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించనుంది. పరువు నష్టం కేసులో రెండేండ్లు శిక్ష విధిస్తూ సూరత్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై న్యాయస్థానం నేడు తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో కోర్టు స్టే విధించినట్లయితే రాహుల్‌ అనర్హత రద్దయ్యే అవకాశం ఉంది. ఒక వేళ అలాకానట్లయితే రాహుల్‌ గుజరాత్‌ కోర్టులోని ఉన్నత ధర్మాసనం ముందు అప్పీలు చేసుకునే అవకాశం ఉంటుంది. సూరత్‌ కోర్టు విధించిన రెండేండ్ల శిక్షను న్యాయస్థానం సమర్థించినట్లయితే.. ఆరేండ్లపాటు రాజకీయాలకు రాహుల్‌ అనర్హుడవుతాడు.

కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో నిర్వహించిన ర్యాలీలో రాహుల్‌ గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ.. ‘దొంగలందరి ఇంటిపేరు మోడీయే’ ఎందుకంటూ.. ప్రశ్నించారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతం వ్యక్తంచేసిన గుజరాత్‌ బిజెపి ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ సూరత్‌ న్యాయస్థానంలో పరువునష్టం దావావేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. రాహుల్‌ గాంధీ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని రాహుల్‌ తన వాదనను వినిపించారు. అయితే పూర్తిస్థాయి విచారణ అనంతరం కోర్టు.. ఈ ఏడాది మార్చి 23న ఆయనను దోషిగా తేల్చుతూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది.