చంద్రబాబు తో ప్రశాంత్‌ కిషోర్ భేటీ..అసలు విషయం చెప్పిన ఐప్యాక్‌

టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు తో శనివారం ప్రశాంత్‌ కిషోర్ భేటీ కావడం తో ఏపీ రాజకీయాల్లో చర్చగా మారింది. గత ఎన్నికల్లో జగన్ విజయానికి కారకులైన ప్రశాంత్..ఇప్పుడు చంద్రబాబు తో భేటీ కావడం తో చంద్రబాబు కోసం ప్రశాంత్ పనిచేయబోతున్నారా..? అని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

హైదరాబాద్‌ నుంచి నారా లోకేష్‌తో పాటుగానే గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఆయన.. లోకేష్‌ వాహనంలోనే చంద్రబాబు నివాసానికి వెళ్లారు.. ఇక, చంద్రబాబు, లోకేష్‌, పీకే మధ్య దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘ మంతనాలు జరిగాయి.. ఏపీలో తన దగ్గర ఉన్న సర్వే నివేదికలను పీకే.. చంద్రబాబు ముందు ఉంచినట్టుగా తెలుస్తోంది. పీకేతో పాటు.. ఇప్పటికే టీడీపీతో కలిసి పనిచేస్తున్న టీమ్‌ కూడా ఈ భేటీలో పాల్గొన్నట్టుగా చెబుతున్నారు. దీంతో, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి తన వ్యూహాలను ప్రశాంత్‌ కిషోర్‌ అందిస్తారనే చర్చ సాగుతుండగా.. ఈ పరిణామాలపై ఐప్యాక్‌ కీలక ప్రకటన చేసింది.

‘ఏపీ ప్రజల అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌కు మా వంతు తోడ్పాటు అందిస్తాం.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీతో కలిసి పనిచేస్తున్నాం.. 2024 ఎన్నికల్లో​ సీఎం వైఎస్‌ జగన్‌ గెలుపుకోసమే మేం పనిచేస్తాం’ అని తన ట్వీట్‌లో పేర్కొంది ఐప్యాక్‌.