ప్రశాంత్ కిషోర్‌ కాలికి గాయం.. పాదయాత్ర వాయిదా

Prashant Kishor injured, puts off padayatra

పాట్నా: రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్‌ కిషోర్‌ కాలికి గాయమైంది. ఈ నేపథ్యంలో బీహార్‌లో ‘జన సూరజ్‌’ పేరుతో ఆయన చేస్తున్న పాదయాత్రకు కాస్త విరామం ఇచ్చారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. వైశాలి జిల్లాలో పాదయాత్ర సందర్భంగా ఎడమ కాలికి గాయమైందని తెలిపారు. చాలా దూరం నడవడం వల్ల పాదం నొప్పిగా ఉందన్నారు. కంకర తేలిన రోడ్లపై నడక వల్ల కాలి నరాలు దెబ్బతిన్నట్లు వైద్య పరీక్షలో తేలిందన్నారు. అంతే తప్ప తనకు ఇతర అనారోగ్య సమస్యలు లేవని చెప్పారు. వైద్యుల సలహా మేరకు రెండు వారాలపాటు పాదయాత్రకు విరామం ఇచ్చినట్లు చెప్పారు. విశ్రాంతి తర్వాత అంతే ఉత్సాహం, అదే శక్తితో పాదయాత్రను కొనసాగిస్తానని వెల్లడించారు.

కాగా, ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయిన సొంత రాష్ట్రం బీహార్‌ను ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రశాంత్‌ కిషోర్‌ పాదయాత్ర చేపట్టారు. తన ప్రసంగాల్లో ప్రధానంగా సీఎం నితీశ్‌ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శించారు. ఆయన జన సూరజ్‌ పాదయాత్రకు ఈ ఏడాది మే 2తో ఏడాది పూర్తయ్యింది. బీహార్‌లోని ఏడు జిల్లాల పరిధిలో విస్తృతంగా 3,000 కిలోమీటర్ల దూరం ఆయన నడిచారు. మిగతా 30 జిల్లాల్లో కూడా పాదయాత్ర కొనసాగించనున్నారు.