హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం కన్నుమూత

హిమాచల్ ప్రదేశ్‌కు ఆరుసార్లు సీఎంగా పనిచేసిన వీరభద్ర సింగ్

సిమ్లా : హిమాచ‌ల్ ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు వీర‌భ‌ద్ర‌సింగ్‌(87) క‌న్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరభద్రసింగ్ సోమవారం గుండెపోటుకు గురయ్యారు. దీంతో పరిస్థితి మరింత దిగజారింది. వెంటనే వెంటిలేటర్‌పైకి తరలించి చికిత్స అందిస్తుండగా ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

ఏప్రిల్ 12న ఆయన తొలిసారి కరోనా బారినపడ్డారు. దీంతో చండీగఢ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి కోలుకుని అదే నెల 30న డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత కొన్ని గంటలకే గుండెపోటు రావడంతో సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. కాగా, గత నెల 11న ఆయనకు మరోమారు కరోనా సోకినట్టు వైద్యులు తెలిపారు.

1960లలో రాజకీయాల్లో అడుగుపెట్టిన వీరభద్ర సింగ్ 9 సార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ఎంపీగా విజయం సాధించారు. హిమాచల్ ప్రదేశ్‌కు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఆర్కీ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2012లో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌గానూ పనిచేశారు. వీరభద్రసింగ్ భార్య ప్రతిభా సింగ్ గతంలో ఎంపీగా పనిచేశారు. కుమారుడు విక్రమాదిత్య సిమ్లా రూరల్ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/