ప్రశాంత్‌ భూషణ్‌ కేసు మరో బెంచ్‌కు బదిలీ

Supreme Court -Prashant Bhushan

న్యూఢిల్లీ: న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ కోర్టు ధిక్కరణ కేసుపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈసందర్భంగా ప్రశాంత్ భూషణ్ కేసు విచారణను సుప్రీంకోర్టు మరో బెంచ్‌కు సిఫార్సు చేసింది. ఈ కేసు విచారణకు తగిన బెంచ్‌ను కేటాయించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డేను ధర్మాసనం మంగళవారం కోరింది. మరో బెంచ్ కేటాయింపు కోసం ఈ కేసు విచారణను సెప్టెంబర్ 10న లిస్టింగ్ చేసింది. తనకు తగిన సమయం లేదని, ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుందని న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా తెలిపారు. ఈ కేసు కేవలం శిక్షకు సంబంధించినది కాదని, వ్యవస్థపై నమ్మకానికి సంబంధించినది ఆయన అన్నారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం లేనప్పుడు శిక్షపై మినహాయింపు కోరి ఏమి ప్రయోజనమని జస్టిస్ అరుణ్ మిశ్రా వ్యాఖ్యానించారు.


మరోవైపు ప్రశాంత్ భూషణ్ తరుఫున హాజరైన న్యాయవాది రాజీవ్ ధావన్ తన వాదనలు వినిపించారు. న్యాయమూర్తుల అవినీతిని గురించి ప్రశ్నించిన ఈ కేసు ధిక్కారం కిందకు వస్తుందా రాదా అన్నది రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించాలని ఆయన కోరారు. అయితే ఈ కేసుకు సంబంధించి తమకు పలు సందేహాలున్నాయని జస్టిస్ అరుణ్ మిశ్రా అన్నారు. ..న్యాయమూర్తుల అవినీతి గురించి మీడియా ముందు మాట్లాడవచ్చా? … ఏ న్యాయమూర్తిపైన నీకు వివాదం ఉంటే ఎలా వ్యవహరించాలి? …. ఎలాంటి పరిస్థితుల్లో ఆ ఆరోపణలు చేయాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాల్సి ఉందన్నారు. కాగా, దీనికి బదులిచ్చిన రాజీవ్ ధావన్, కేవలం అవినీతి అన్న పదం ఉపయోగించినంత మాత్రాన అది కోర్టు ధిక్కారం కిందకు రాదని చెప్పారు. ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించాలని ఆయన కోరారు. దీంతో ఈ కేసు విచారణను మరో బెంచ్‌కు సిఫార్సు చేస్తున్నట్లు న్యాయమూర్తి అరుణ్ మిశ్రా పేర్కొన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/