టర్కీ లో నిమిషాల వ్యవధిలో రెండు భారీ భూకంపాలు

టర్కీ లో నిమిషాల వ్యవధిలో రెండు భారీ భూకంపాలు చోటుచేసుకున్నాయి. సోమవారం తెల్లవారుజామున సిరియా సరిహద్దుల్లోని దక్షిణ టర్కీలో భారీ భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేల్‌పై 7.8గా నమోదయ్యింది. అనంతరం 6.7 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. గజియాన్‌టెప్ ప్రావిన్సుల్లోని నుర్దగి నగరానికి తూర్పున 26 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్టు తెలిపింది. 17.9 కి.మీ. లోతున భూకంప కేంద్రం ఉందని పేర్కొంది. అలాగే, నిమిషాల వ్యవధిలోనే మధ్య టర్కీలో 9.9 కిలోమీటర్ల లోతులో రెండో భూకంపం వచ్చిందని అమెరికా జియోలాజికల్ సర్వే వివరించింది.

7.8 తీవ్రతతో సంభవించిన భూకంప ధాటికి భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. శిథిలాల కింద చిక్కుకుని 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతోమంది తీవ్రంగా గాయపడ్డారు. భూకంపం తర్వాత హృదయ విదారకంగా ఉన్న పరిస్థితులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి హాహాకారాలతో భూకంప ప్రభావిత ప్రాంతాలు దయనీయంగా మారాయి.