బీఆర్ఎస్ ను గద్దె దింపేందుకే కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న – పొంగులేటి

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు సిద్దమయ్యాడు. జులై 2న ఖమ్మంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి తో పాటు జూపల్లి చేరుతున్నారు. వీరే కాదు మరో 13 మంది కీలక నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈరోజు ఢిల్లీలో పొంగులేటి కాంగ్రెస్ నేతలతో వరుస భేటీలతో బిజీ బిజీగా గడిపారు.

సమావేశం అనంతరం మీడియా తో మాట్లాడుతూ..తాను కాంగ్రెస్ పార్టీ లో ఎందుకు చేరుతున్ననేది తెలిపారు. తాను పదవి కోసమే అయితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లబోనని, అవినీతి బీఆర్ఎస్ ను గద్దె దింపేందుకే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో లేదు, దేశంలో అధికారంలో లేదు… కాంగ్రెస్ లోకి వెళితే నాకు ఇబ్బందులు ఉంటాయని తెలుసు. ఆల్రెడీ సమస్యలు

మొదలయ్యాయి కూడా. అయినా కూడా, ప్రజల కోసం, ప్రజల మనోభావాల కోసం… ఏ కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో… ఆ పార్టీకి తెలంగాణ బిడ్డల రుణాన్ని తీర్చడం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేసారు. తెలంగాణ బిడ్డలు కోరుకున్నది ఇంకా నెరవేరలేదు. ప్రజలు, యువత ఏం కోరుకుంటున్నారో పరిశీలించాం. తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవం కోల్పోయారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని అనుకున్నారు.

నాకు పదవులు అక్కర్లేదు, పదవుల కంటే ఆత్మాభిమానమే ముఖ్యం అన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. అదే సమయంలో తెలంగాణలో బీజేపీ పరిస్థితి దిగజారుతోంది. ఈ నేపథ్యంలోనే, కాంగ్రెస్ వైపు అడుగులు వేశాను. జులై 2న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను” అని పొంగులేటి వెల్లడించారు.