షిర్డి సాయిబాబా ఆలయం తెరిచే ఉంటుంది

shirdi sai baba temple
shirdi sai baba temple

షిర్డి: షిర్డిలోని సాయి సంస్థాన్‌ ట్రస్ట్‌ సాయిబాబా ఆలయాన్ని తెరిచే ఉంచారు. యథావిధిగా భక్తులు ఆదివారం సాయిబాబాను దర్శించుకుంటున్నారు. సాయిబాబా జన్మస్థలమైన పర్బని జిల్లాలోని పత్రి పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే ప్రకటించడంతో పత్రి అభివృద్ధి కారణంగా షిర్డి ఆలయ ప్రాశస్త్యం తగ్గిపోతుందేమోనని షిర్డి, పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పత్రి సాయిబాబా జన్మస్థలమన్న వ్యాఖ్యలను ఉద్ధవ్‌ ఉపసంహరించుకోవాలంటూ స్థానికులు షిర్డి నిరవధిక బంద్‌కు పిలుపు నిచ్చారు. అయితే, షిరిడీలో బంద్ ప్రభావం బాబా ఆలయంపై ఉండదని, ఆలయం తెరిచే ఉంటుందని షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి దీపక్ మదుకర్ ముగ్లికర్ ప్రకటించారు. ఆదివారం ఆలయం మూసివేస్తారనే వదంతులను నమ్మవద్దని కూడా ఆయన ఓ ప్రకటనలో కోరారు. షిర్డీ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు తీసుకున్నట్టు ట్రస్టు సభ్యుడు బి.వాక్‌చౌరె తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/