ఏ పార్టీలో చేరేది హైదరాబాద్ లో అధికారికంగా వెల్లడిస్తాః పొంగులేటి

బిఆర్ఎస్ కు వడ్డీతో సహా తిరిగిచ్చే సమయం వచ్చిందని కామెంట్

ponguleti-srinivas-reddy-fire-kcr-after-meeting-with-followers-in-khammam

ఖమ్మం: కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న వార్తల నడుమ మాజీ ఎంపీ పొంగులేని శ్రీనివాస్ రెడ్డి ఖమ్మంలో తన ప్రధాన అనుచరులతో సమావేశం అయ్యారు. సమావేశం అయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఏ పార్టీలో చేరేది హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారికంగా వెల్లడిస్తానని ప్రకటించారు. తనను నమ్ముకున్న అనుచరులు చెప్పినట్టే చేస్తానని వెల్లడించారు. బిఆర్ఎస్ కు వడ్డీతో సహా తిరిగిచ్చే సమయం వచ్చిందని ఆయన కామెంట్ చేశారు. తాను ఓ పార్టీలో చేరుతానని ఊహించిన బిఆర్ఎస్ స్థానిక నేతలు మందు పార్టీలు, పండుగ చేసుకున్నారని అన్నారు. కానీ, మారిన తన వ్యూహంతో వారికి ఇప్పుడు నిద్ర పట్టడం లేదన్నారు.

సిఎం కెసిఆర్‌, బిఆర్ఎస్ పై తాను యుద్ధం ప్రకటించి ఐదు నెలలు అవుతోందన్నారు. రాబోయే కురుక్షేత్రంలో తనను తట్టుకోలేమని, ఎన్నికల్లో గెలవక మళ్లీ ప్రజా ప్రతినిధులు కాలేమని వాపోతున్నారని ఎద్దేవా చేశారు. తండ్రిలా భావించిన కెసిఆర్ తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఎన్నోసార్లు అవమానించినా ఓర్చుకొని, సహనంతో ఉన్నానని చెప్పారు. ప్రజలను పట్టించుకోని కెసిఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామంటూ హెచ్చరించారు.