కుసుమ జగదీశ్‌ పార్థివదేహానికి మంత్రి కెటిఆర్‌ నివాళులు

minister-ktr-tributes-mulugu-brs-president-kusuma-jagadish

ములుగు: పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కెటిఆర్‌ బిఆర్‌ఎస్‌ ములుగు జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కుసుమ జగదీశ్‌ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ములుగు జిల్లా మల్లంపల్లిలోలోని ఆయన నివాసానికి చేరుకున్న మంత్రి కెటిఆర్‌.. జగదీశ్‌ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి పార్టీ అండగా ఉంటుందన్నారు. మంత్రి కెటిఆర్‌తోపాటు మంత్రి పువ్వాడ అజయ్‌, ఎంపీలు సంతోష్‌ కుమార్‌, రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యే బాల్కా సుమన్‌.. జగదీశ్‌కు నివాళులర్పించారు.

కుసుమ జగదీశ్వర్‌ (47) ఆదివారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. హనుమకొండ స్నేహనగర్‌లో ఉంటున్న ఆయన ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఇంట్లో స్నానం చేసి బయటకు వస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. గన్‌మెన్ల సాయంతో భార్య రమాదేవి వెంటనే ఆయనను హనుమకొండలోని లైఫ్‌లైన్‌ దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు హైదరాబాద్‌కు తరలించాలని సూచించగా సమయం లేకపోవడంతో అక్కడే అజార దవాఖానకు తీసుకెళ్లారు. అయితే అక్కడ చికిత్స అందిస్తుండగానే కన్నుమూశారు.

కాగా, 14 ఏండ్లపాటు హైదరాబాద్‌లోని బిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలోనే ఉంటూ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో జగదీశ్‌ కీలక పాత్ర పోషించారు. గత ఎన్నికల సమయంలో ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ములుగు జిల్లా ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఆయనకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అవకాశం కల్పించారు. ఏప్రిల్‌ 1న జగదీశ్వర్‌ తొలిసారి గుండెపోటుకు గురికాగా భార్య రమాదేవి సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడారు. ఆ తర్వాత హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 9న నిర్వహించిన సంక్షేమ సంబురాల్లోనూ పాల్గొన్నారు.