తెలంగాణ ఎలక్షన్ కోడ్ : మూడు రోజుల్లో రూ.10 కోట్లు పట్టివేత

తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం తో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ కొనసాగుతుంది. దీంతో పోలీసులు ఎక్కడిక్కడే తనిఖీలు చేపడుతూ..పెద్ద ఎత్తున పత్రాలు లేని నగదును , బంగారాన్ని పట్టుకుంటున్నారు. పోలీసుల వాహనాల తనిఖీల్లో రోజూ లక్షల కొద్దీ నగదు, బంగారం సహా ఇతర వస్తువులు పట్టుబడుతున్నాయి. కేవలం మూడ్రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా రూ.10 కోట్ల విలువైన నగదు, బంగారం పట్టుబడింది.

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే 5 కోట్ల నగదు, ఏడు కిలోలకు పైగా బంగారం.. హైదరాబాద్ కుల్సుంపుర ఠాణా పరిధిలో చేపట్టిన తనిఖీల్లో ఓ వ్యక్తి నుంచి 600 గ్రాముల బంగారం.. చైతన్యపురి పోలీసుస్టేషన్‌ పరిధిలో 60 లక్షలు.. మహంకాళి ఠాణా పరిధిలో ఐదుగురు వ్యక్తుల దగ్గర నుంచి 29 లక్షల విలువైన 55 తులాల బంగారం.. దోమలగూడ, గాంధీనగర్‌ పోలీస్ స్టేషన్ల పరిధిలో కారులో తరలిస్తున్న కేజీ బంగారంతో పాటు రెండు లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మూడు కమిషనరేట్ల ఉన్నతాధికారులు, సిబ్బందితో కమిషనర్లు సమావేశాలు నిర్వహిస్తూ.. 24 గంటలు పని చేసేలా ప్రత్యేక సెల్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. అక్రమ నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు లేదా ఇతర ప్రలోభాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.