ఎమ్మెల్యే రాజాసింగ్ ఫై మరో కేసు నమోదు చేసిన పోలీసులు

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఫై మరో కేసు నమోదు చేసారు పోలీసులు. శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రలో రాజాసింగ్ చేసిన ప్రసంగం వివాదాస్పదంగా ఉందంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అప్జల్ గంజ్ పీఎస్ లో ఆయనపై కేసు నమోదైంది. పీడీయాక్ట్ కేసులో జైలుకెళ్లి ఇటీవలే విడుదలైన రాజాసింగ్.. బెయిల్ మీద విడుదలైన టైంలో తెలంగాణ హైకోర్టు.. విద్వేష పూరిత మాటలు మాట్లాడొద్దంటూ ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. తాజాగా ఆ ఆదేశాలను ఉల్లంఘించేలా రాజాసింగ్ మాట్లాడారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.

మరోపక్క ముంబై లోను రాజాసింగ్ ఫై కేసు నమోదైంది. జనవరి 29న ముంబైలోని ముంబై మంఘళ్ హట్ లో జరిగిన కార్యక్రమంలో రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఐపీసీ సెక్షన్ 153ఎ 1 (ఎ) కింద ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సభలో మాట్లాడిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారు. కోర్టు నిబంధనలను ఉల్లంఘించినందుకు హైదరాబాద్ పోలీసులు రాజాసింగ్ కు నోటీసులు ఇచ్చి, ఈ విషయంపై వివరణ ఇవ్వాలని కోరారు. ఇలా రాజాసింగ్ ఫై పోలీసులు కేసులు నమోదు చేయడం ఫై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే పోలీసులు రాజాసింగ్ ఫై కేసులు పెడుతున్నారని అంటున్నారు.