నేను బీజేపీ మనిషిని అంటూ మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు

సినీ నటుడు , మాజీ ఎంపీ , శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మంచు మోహన్ బాబు ఈరోజు తిరుపతిలో కీలక వ్యాఖ్యలు చేసారు. ‘నేను బీజేపీ మనిషిని. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునేవాడిని’ అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చ గా మారాయి. రాజకీయంగా వైస్సార్సీపీ తో కలిసిన ఆయన ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు కొత్త లెక్కలకు దారి తీస్తున్నాయి.

2019లో ప్రభుత్వం నుంచి తన విద్యా సంస్థలకు రావాల్సిన బకాయిలు ఎక్కువగా ఉండటంతో విద్యార్థులతో కలిసి మోహ‌న్ బాబు భారీ ర్యాలీని చేప‌ట్టిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. అయితే అప్ప‌టికే ఎన్నిక‌ల కోడ్ నిబంధ‌న‌లు అమల్లోకి వ‌చ్చాయి. దీంతో ఎన్నిక‌ల కోడ్ ప్ర‌కారం భారీ ర్యాలీలు చేప‌ట్ట‌కూడ‌దు కాబ‌ట్టి చంద్ర‌గిరి పోలీసులు మార్చి 22, 2019లో కేసు న‌మోదు చేశారు. ఇప్పుడీ వ్య‌వ‌హారంపై కోర్టులో ఛార్జీషీటు దాఖ‌లు చేశారు. దీనికి సంబంధించిన విచార‌ణ కోసం తిరుప‌తి లోని అడిష‌న‌ల్ జూనియ‌ర్ సివిల్ జ‌డ్జ్ ముందుకు మోహ‌న్ బాబు, ఆయ‌న కుమారులు హాజరయ్యారు. ఈ తరుణంలో మోహ‌న్ బాబు టౌన్ క్ల‌బ్ నుంచి కోర్టు వ‌ర‌కు ఆయ‌న కుమారులు విష్ణు మంచు, మంచు మ‌నోజ్‌తో క‌లిసి పాద‌యాత్ర చేసారు.

ఈ సంద‌ర్భంలో ఆయ‌న హాట్ కామెంట్స్ చేశారు. ‘నేను బీజేపీ మనిషిని. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునేవాడిని. రియల్ హీరోని, విద్యార్థుల కోసం పోరాడితే అక్రమ కేసులు పెట్టారు’ అని మోహన్ బాబు తెలిపారు. వైఎస్సార్ కుటుంబంతో మోహన్ బాబుకు బంధుత్వం ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరిన మోహన్ బాబు ఆ పార్టీ అభ్యర్ధుల విజయం కోసం ప్రచారం చేసారు. జగన్ సీఎం అవ్వాలంటూ ప్రచారంలో పదే పదే చెప్పుకొచ్చారు. వైసీపీ ఎన్నికల్లో గెలిచి..సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత క్రమేణా మోహన్ బాబు దూరం పాటిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే.. మోహన్ బాబు టీటీడీ ఛైర్మన్ లేదా రాజ్యసభ ఇస్తారనే ప్రచారం సాగింది. ఆ తరువాత ఫిలిం డెవలప్ మెంట్ బోర్డు ఛైర్మన్ పదవి ఇస్తారనే వాదన వినిపించింది. కానీ, ఎటువంటి పదవులు దక్క లేదు. కొద్ది నెలల క్రితం మోహన్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ప్రధాని తనకు ఇచ్చిన గౌరవానికి మోహన్ బాబు సంతోషం వ్యక్తం చేసారు. దీంతో..ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్దమైందనే ప్రచారం సాగింది. కానీ, మోహన్ బాబు బీజేపీలో చేరలేదు. ఆ తరువాత కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చిన మోహన్ బాబు తాను మోదీకి మద్దతు దారుడినని..ఆయనంటే ఇష్టపడతానని.. ప్రధాని సైతం తనకు గౌరవం ఇస్తారని చెప్పుకొచ్చారు. ఇక ఈరోజు కూడా అలాగే బిజెపి కి సపోర్ట్ గా మాట్లాడారు.