నేటి అర్ధరాత్రి వరకు వైన్స్‌ ఓపెన్‌

న్యూఇయర్‌ వేడుకల నేపథ్యంలో ఉత్తర్వులు

Liquor shops

హైదరాబాద్‌: న్యూ ఇయర్‌ సందర్భంగా తెలంగాణ ఆబ్కారీ శాఖ ఈరోజు అర్ధ రాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు తెరిచి పెట్టుకునేందుకు, ఒంటి గంట వరకు బార్లలో మద్యాన్ని సరఫరా చేసేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నూతన సంవత్సర వేడుకల ద్వారా కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని, కాబట్టి వేడుకలపై నిఘా పెట్టాలంటూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన వేళ తెలంగాణ ఆబ్కారీ శాఖ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది.

మరోవైపు, రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకలకు అనుమతులు లేవని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. నేడు మూడు కమిషనరేట్ల పరిధిలో అడుగడుగునా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. సీపీ సజ్జనార్ కూడా ఇలాంటి హెచ్చరికలే చేశారు. అయితే, ఆబ్కారీ శాఖ మాత్రం ఇందుకు భిన్నంగా అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు తెరుచుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. అలాగే, బార్లు, క్లబ్బులు, టూరిజం హోటళ్లలో రాత్రి ఒంటి గంట వరకు మద్యాన్ని అందించవచ్చని ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/