జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో ప్రధాని మోడి భేటి
షింజో అబేకు అధికారికంగా తుది వీడ్కోలు పలికేందుకు జపాన్ కు వెళ్లిన మోడీ

టోక్యోః నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఆ ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. అనేక ప్రాంతీయ, గ్లోబల్ సమస్యలపై ఆ ఇద్దరూ మాట్లాడుకున్నట్లు విదేశాంగశాఖ తెలిపింది. భారత్, జపాన్ వ్యూహాత్మక సంబంధాల గురించి కూడా మాట్లాడుకున్నారు. మాజీ ప్రధాని షింజో అబే పార్దీవదేహానికి ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ జపాన్‌కు వెళ్లారు.
కాగా, ఇటీవల హత్యకు గురైన జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అధికారిక తుది వీడ్కోలు కార్యక్రమం నేడు టోక్యోలో నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరవుతున్నారు. అందుకోసం మోడీ నిన్న ప్రత్యేక విమానంలో జపాన్ పయనమయ్యారు. అంతకుముందు ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ, ఈ రాత్రికి టోక్యో వెళుతున్నానని వెల్లడించారు. మాజీ ప్రధాని షింజో అబే తుది వీడ్కోలు కార్యక్రమానికి హాజరవుతానని, షింజో అబే తనకు అత్యంత సన్నిహితుడని, భారత్-జపాన్ మైత్రికి సంబంధించి ఆయన గొప్ప విజేత అని మోడీఅభివర్ణించారు. షింజో అబే వంటి మహోన్నత నేతను కోల్పోయినందుకు జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, అబే అర్ధాంగికి భారతీయులందరి తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని వివరించారు. షింజో అబే ఆశయాలను కొనసాగిస్తూ భారత్, జపాన్ సంబంధాల బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/