ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు

Govt restricts import of laptops, tablets, personal computers

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం విదేశాల నుండి ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, వ్యక్తిగత కంప్యూటర్ల దిగుమతిపై ఆంక్షలు విధించింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది. చట్టబద్ధమైన అనుమతి ఉన్నవారికే అదికూడా పరిమిత సంఖ్యలో దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తామని పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంతో దేశీయంగా కంప్యూటర్ల తయారీకి ఊతమందుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

దేశంలో ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌, పర్సనల్‌ కంప్యూటర్ల తయారీకి స్ఫూర్తినిస్తుందని మాన్యుఫ్యాక్షరర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సంఘం మాజీ డైరెక్టర్‌ జనరల్‌ అలీ అక్తర్‌ జాఫ్రీ అన్నారు. కాగా, ఏప్రిల్‌-జూన్‌ నెలల్లో ట్యాబ్‌లు కంప్యూటర్లతో సహా ఎలక్ట్రానిక్‌ వస్తువుల దిగుమతులు 19.7 బిలియన్‌ డాలర్లకు చేరాయన్నారు. గతేడాదితో పోల్చితే ఇది 6.25 శాతం అధికమని చెప్పారు. దేశీయ మార్కెట్‌లో అసర్‌, శాంసంగ్‌, ఎల్జీ, పానాసోనిక్‌, ఆపిల్‌, లెనొవో, హెచ్‌పీ, డెల్‌ వంటి కంపెనీల ల్యాప్‌టాప్‌ల అధికంగా అమ్ముడవుతున్నాయి. వీటిలో ఎక్కువగా చైనా నుంచే దిగుమతి అవుతుండటం గమనార్హం.