విద్యార్థులు త‌మ‌తో తాము పోటీప‌డాల‌ని, ఇత‌రుల‌తో కాదుః ప్ర‌ధాని మోడీ

PM Modi to students at Pariksha Pe Charcha

న్యూఢిల్లీ: నేడు కేంద్ర విద్యాశాఖ ఆధ్వ‌ర్యంలో ఢిల్లీలోని భార‌త్ మండ‌పంలో జ‌రిగిన ప‌రీక్షా పే చ‌ర్చ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నప్ర‌ధాని మోడీ విద్యార్థుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. ప‌రీక్షా పే చ‌ర్చ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం త‌న‌కు కూడా ఓ ప‌రీక్ష లాంటింద‌న్నారు. ప‌రీక్ష‌ల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైవుతున్న నేప‌థ్యంలో ఆ అంశంపై ఆయ‌న మాట్లాడుతూ గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో విద్యార్థులు చాలా ఇన్నోవేటివ్‌గా మారిన‌ట్లు పేర్కొన్నారు. భార‌త భ‌విష్య‌త్తును తీర్చిదిద్దేది విద్యార్థులే అని ప్ర‌ధాని మోడీ అన్నారు. మ‌న విద్యార్థులే మ‌న భ‌విష్య‌త్తును నిర్దేశిస్తార‌న్నారు.

పోటీలు, స‌వాళ్లు జీవితంలో ప్రేర‌ణ‌గా నిలుస్తాయ‌ని, కానీ పోటీ ఎప్పుడూ ఆరోగ్య‌క‌రంగా ఉండాల‌ని ప్ర‌ధాని అన్నారు. మీ పిల్ల‌వాడిని మ‌రో పిల్ల‌వాడితో పోల్చ‌వ‌ద్దు అని, ఎందుకంటే అది వాళ్ల భ‌విష్య‌త్తుపై ప్ర‌భావం చూపుతుంద‌న్నారు. విద్యార్థులు త‌మ‌తో తాము పోటీప‌డాల‌ని, ఇత‌రుల‌తో కాదు అని ప్ర‌ధాని తెలిపారు. పిల్ల‌ల రిపోర్టు కార్డును త‌మ విజిటింగ్ కార్డుగా కొంద‌రు త‌ల్లితండ్రులు భావిస్తార‌ని, ఇది స‌రైన విధానం కాద‌న్నారు. విద్యాబోధ‌న‌ను టీచ‌ర్లు కేవ‌లం ఉద్యోగంగా భావించ‌కూడ‌ద‌ని, విద్యార్థుల జీవితాల‌ను మ‌లిచే ల‌క్ష్యంతో ప‌నిచేయాల‌న్నారు.

ఇటీవ‌ల భార‌త మండ‌పంలో జ‌రిగిన జీ20 స‌దస్సులో దేశాధినేతలు రెండు రోజుల పాటు ప్ర‌పంచ శ్రేయ‌స్సు కోసం ప్ర‌ణాళిక‌లు వేశార‌ని, ఇప్పుడు మీరు ఆ వేదిక‌పై కూర్చుని భార‌త భ‌విష్య‌త్తు గురించి చ‌ర్చిస్తున్నార‌ని ప్ర‌ధాని మోడీ విద్యార్థుల‌ను ఉద్దేశించి పేర్కొన్నారు. చాలా తెలివైన‌, క‌ష్ట‌ప‌డే వ్య‌క్తుల‌ను మిత్రులుగా చేసుకోవాల‌ని, అలాంటి ఫ్రెండ్స్‌తో ప్రేర‌ణ పొందాల‌న్నారు. కెరీర్ విష‌యంలో చాలా గ‌ట్టి నిర్ణ‌యం తీసుకోవాల‌ని, అప్పుడు ఎటువంటి గంద‌ర‌గోళం ఉండ‌ద‌న్నారు.

విద్యార్థులు ఎక్కువ‌గా వ‌త్తిడికి లోను కావొద్దు అని, ఎందుకంటే అది వారి సామ‌ర్థ్యాన్ని దెబ్బ‌తీస్తుంద‌ని, అతిగా దేన్ని సాగ‌దీయ‌రాదు అని, ఏ విధానంలోనైనా క్ర‌మ ప‌ద్ధ‌తిలో పురోగ‌తి సాధించాల‌ని విద్యార్థుల‌తో ప్ర‌ధాని మోడీ పేర్కొన్నారు. పేరెంట్స్‌, టీచ‌ర్లు, బంధువులు ఎవ‌రు కూడా విద్యార్థుల‌పై ప‌దేప‌దే నెగ‌టివ్ పోలిక‌లు చేయ‌కూడ‌ద‌ని, ఎందుకంటే అది ఆ విద్యార్థి మాన‌సిక స్థితిపై ప్ర‌భావం చూపుతుంద‌న్నారు. ఆ పోలిక‌ల వ‌ల్ల మంచి క‌న్నా చెడు ఎక్కువ‌గా జ‌రుగుతుంద‌న్నారు. విద్యార్థుల మ‌నోధైర్యాన్ని దెబ్బ‌తీయ‌కుండా చాలా సున్నిత విధానంలో సంభాష‌ణ‌లు చేయాల‌న్నారు.

టీచ‌ర్లు, విద్యార్థుల మ‌ధ్య‌ బంధం ఎలా ఉండాలంటే, ఇది కేవ‌లం స‌బ్జెక్ట్ సంబంధిత రిలేష‌న్ మాత్ర‌మే కాదు అని, అంత‌క‌న్నా ఎక్కువే అన్న భావ‌న విద్యార్థుల్లో రావాల‌న్నారు. టీచ‌ర్లు, స్టూడెంట్ల మ‌ధ్య రిలేష‌న్ చాలా గాఢంగా ఉండాల‌న్న అభిప్రాయాన్ని ప్ర‌ధాని వ్య‌క్తం చేశారు. త‌మ‌లో ఉన్న వ‌త్తిళ్లు, స‌మ‌స్య‌లు, అభ‌ద్ర‌తా అంశాల‌ను విద్యార్థులు చాలా ధైర్యంగా టీచ‌ర్ల‌తో చ‌ర్చించే రీతిలో వారి మ‌ధ్య రిలేష‌న్ ఉండాల‌న్నారు. విద్యార్థుల‌ స‌మ‌స్య‌ల‌ను విని వాళ్ల బాధ‌ల‌ను టీచ‌ర్లు తీర్చితే అప్పుడు ఆ విద్యార్థులు చాలా ఎదుగుతార‌ని ప్ర‌ధాని తెలిపారు.

ఈసారి ప‌రీక్షా పే చ‌ర్చా కార్య‌క్ర‌మానికి ప్ర‌తి రాష్ట్రానికి చెందిన ఇద్ద‌రు విద్యార్థుల‌ను, ఓ టీచ‌ర్‌ను ఆహ్వానించారు. క‌లా ఉత్స‌వ్ విజేత‌ల‌ను కూడా ఆహ్వానించారు. MyGov పోర్ట‌ల్ ద్వారా సుమారు 2.26 కోట్ల మంది విద్యార్థులు ఈ కార్య‌క్ర‌మం కోసం రిజిస్ట‌ర్ చేసుకున్నారు.

YouTube video