ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

చంద్రబాబు బెయిల్ తిరస్కరించాలన్న పిటిషన్ కొట్టివేత

supreme-court-permits-chandrababu-to-participate-in-political-activities-and-rallies

న్యూ ఢిల్లీః సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ… హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వ పిటిషన్ ను తిరస్కరించింది. ఇదే కేసులో సహ నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకు కూడా వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది.

2022లో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలయిందని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులోని ఇతర నిందితులంతా ముందస్తు బెయిల్ పై ఉన్నారని… చంద్రబాబు బెయిల్ మాత్రమే రద్దు చేయాలని ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించింది. ఒకే ఎఫ్ఐఆర్ లో ఉన్న నిందితులంతా బెయిల్ పై ఉన్నప్పుడు… అవే నిబంధనలు చంద్రబాబుకు కూడా వర్తిస్తాయని తెలిపింది. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడానికి కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో కూడా 17ఏ నిబంధన వర్తిస్తే ఏం చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది.

విచారణ సందర్భంగా, సెక్షన్ 420 కింద కూడా దర్యాప్తు జరుగుతుందని సుప్రీంకోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. పలు ఐపీసీ సెక్షన్లు కూడా దీనికి ఉన్నాయని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ… ఈ కేసుకు సెక్షన్ 420 ఎలా వర్తిస్తుందని ప్రశ్నించింది. ప్రస్తుత దశలో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ పిటిషన్ ను తోసిపుచ్చింది. చంద్రబాబుపై సుప్రీంకోర్టులో ఉన్న కేసుల వివరాలన్నింటినీ సుప్రీంకోర్టు తీసుకుంది. చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా పలు ధర్మాసనాల ముందు ఉన్న చంద్రబాబు కేసుల వివరాలను సుప్రీంకోర్టుకు అందించారు.