24న జమ్మూకశ్మీర్ పార్టీలతో ప్రధాని సమావేశం!

శ్రీనగర్‌ : ఈ నెల 24న ప్రధాని మోడీ జమ్మూకాశ్మీర్‌కు చెందిన పార్టీలతో సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాన్ని తిరిగి రాష్ట్రంగా మార్పు, ఎన్నికల నిర్వహణ, ఇతర ముఖ్య అంశాలపై అఖిలపక్ష సమావేశంలో చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 2019, ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను రద్దు చేసి జమ్మూకాశ్మీర్‌, లద్దాఖ్‌ను కేంద్ర భూభాగాలుగా విభజించింది. ఆ తర్వాత చేపట్టిన తొలి రాజకీయ ప్రక్రియ ఇదే.

ఈ సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించనుండగా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఇతర కేంద్ర నేతలు హాజరవుతారు. చర్చల కోసం నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా, పీడీపీ చైర్‌పర్సన్ మెహబూబా ముఫ్తీ, జమ్మూ అండ్ కశ్మీర్ అప్ని పార్టీ (జేకేఏపీ) అల్టాఫ్ బుఖారీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సజ్జద్ లోన్ తదితరులను ఆహ్వానించే ప్రక్రియను కేంద్ర నాయకత్వం ప్రారంభించినట్టు అధికారవర్గాలు తెలిపాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/