సూడాన్‌లో భారతీయుల పరిస్థితిపై ప్రధాని మోడీ అత్యవసర సమీక్ష!

PM Modi to chair meeting on situation of Indians in violence-hit Sudan

న్యూఢిల్లీః సూడాన్‌ రాజధాని ఖార్టూమ్‌లో మూడవ రోజూ హింస కొనసాగింది. అక్కడే చిక్కుకున్న భారతీయుల భద్రతపై ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతున్న తీరుపై చర్చించారు. నిజానికి దక్షిణాఫ్రికా దేశమైన సూడాన్‌లో గత వారం రోజులుగా అంతర్యుద్ధం జరుగుతోంది. సూడాన్ సాయుధ దళాలు, పారామిలిటరీ దళం మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో సూడాన్ అమాయక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇది మాత్రమే కాదు, సూడాన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధంలో చాలా మంది భారతీయులు కూడా చిక్కుకున్నారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ అంతర్యుద్ధంలో చిక్కుకున్న ఓ భారతీయుడు మరణించినట్లుగా తెలుస్తోంది.

సూడాన్‌లో అంతర్యుద్ధం కారణంగా ఇప్పటి వరకు 270 మంది పౌరులు మృత్యువాత పడగా, 2500 మంది క్షతగాత్రులుగా మారారు. సూడాన్‌ అంతర్‌ఘర్షణల్లో ఇప్పటికే ఒక భారతీయుడు చనిపోగా తాజాగా 300కి పైగా భారతీయులు అక్కడ చిక్కకుపోయారు. ఓవైపు బాంబుల మోత.. మరోవైపు సైనిక దాడులు.. ఇటు సూడాన్‌ ఆర్మీ.. అటు పారామిలటరీ దళాల మధ్య చెలరేగిన హింసాత్మక ఘటనలతో సూడాన్‌లో యుద్ధవాతావరణం ప్రజలకు భయకంపితులను చేస్తోంది. అయితే సూడాన్‌ పౌర ఘర్షణల్లో కర్నాటకకు చెందిన 31 మంది ఆదివాసీలు అక్కడ చిక్కుకుపోయారు. భారతీయులెవ్వరూ బయటకు రావొద్దంటూ ఇండియన్‌ ఎంబసీ పిలుపుమేరకు వారంతా ఓ ఇంట్లోనే ఉండిపోయారు. చుట్టూ హింసాత్మక ఘటనలు చెలరేగుతుండడంతో బయటకు వచ్చే దారిలేక, తిండీ నీళ్ళులేక అల్లాడిపోతున్నట్లుగా సమాచారం.

మరోవైపు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ.. ప్రస్తుతానికి మా సలహా ఏంటంటే, భారత పౌరులు వారు ఉన్న చోటనే ఉండాలని.. అక్కడ మాత్రమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. పరిస్థితి చక్కబడే వరకు ఎక్కడికీ వెళ్లడానికి ప్రయత్నించవద్దు. ఖార్టూమ్‌లోని రాయబార కార్యాలయం ప్రకారం, సుమారు 2,800 మంది భారతీయులు సూడాన్‌లో చిక్కుకుపోయారు. దీంతో సూడాన్‌లో 150 ఏళ్లుగా నివసిస్తున్న వారు 1200 మంది ఉన్నారు.