జనసేన తీర్థం పుచ్చుకున్న ఆమంచి స్వాములు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర..పార్టీ కి బలం చేకూర్చింది. మొన్నటి వరకు నేతలంతా జనసేన పార్టీ లోకి వెళ్లాలా..వద్దా..? వెళ్తే రాజకీయ భవిష్యత్ ఉంటుందా..లేదా..? అని కాస్త సందేహ పడ్డారు. కానీ వారాహి యాత్ర కు వచ్చిన ప్రజానీకం, ప్రజల్లో ఉన్న అభిమానం , జనసేన పార్టీనే రావాలని ప్రజలు ముక్తకంఠంతో చెపుతుండడం తో ఇతర పార్టీల నేతలు సైతం జనసేన వైపు చూస్తున్నారు.

తాజాగా పర్చూరు వైస్సార్సీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసులు (స్వాములు) ఈరోజు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయానికి భారీ ర్యాలీగా వచ్చిన స్వాములు పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. గతంలోనే ఆయన పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యి పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపారు. పవన్ కల్యాణ్ విధివిధానాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు స్వాములు తెలిపారు. జనసేన టికెట్ ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తానన్నారు. పార్టీ టికెట్ ఇచ్చి పోటీ చేయాలని కోరితే బరిలో నిలుస్తానన్నారు. చీరాల ఎమ్మెల్యేగా ఆమంచి కృష్ణమోహన్ రెండు పర్యాయాలు గెలవడంలో ఆయన అన్న ఆమంచి స్వాములు కీలక పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు ఆమంచి కుటుంబంలో తమ్ముడు వైస్సార్సీపీ లో ఉండగా, అన్న జనసేన లోకి వచ్చారు. మరి రాబోయే రోజుల్లో ఈ అన్నదమ్ముల మధ్య రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి.

ఆమంచి స్వాములు జనసేన పార్టీలో చేరిన సందర్భంగా పవన్ మాట్లాడుతూ..”ఆయనది చీరాల, నేను కూడా చీరాలలో పెరిగినవాడ్నే. ఆయన చీరాల అనుచరవర్గంతో వస్తారనుకున్నాను… కానీ గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోనూ ఆయనకు అభిమానవర్గం ఉండడం ఆనందం కలిగించింది. ఆమంచి స్వాములును మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. కార్యకర్తలకు అండగా నిలబడి, రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేయగల ఆమంచి స్వాములు వంటి నేతలు జనసేనలో ఉండాలని కోరుకునేవాడ్ని. ఈరోజు ఆయన పార్టీలోకి రావడం శుభపరిణామం. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ ఎదుగుదలను ఎవరు అడ్డుకుంటారో చూద్దాం” అని వ్యాఖ్యానించారు.

“శ్రీకాళహస్తిలో మన నాయకుడిపై చెయ్యి పడింది అంటే అది నాపై పడినట్టే. అందుకే తిరుపతి వెళుతున్నాను, తేల్చుకుంటాను. జనసేనలోని ఏ ఒక్క నేత, కార్యకర్తపై అయినా దాడి జరిగితే అది నాపై జరిగినట్టే భావిస్తాను… నేను వచ్చి నిలబడతాను… జాగ్రత్త!” అంటూ తీవ్రస్థాయిలో స్పందించారు. సోమవారం నాడు తాను పవన్ తిరుపతి వెళ్లి SP ని కలవనున్నారు.