ప్రధాని మోడీ చరిత్రకు సరైన వైపు నిలబడ్డారు: ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ప్రశంసలు

PM Modi stands on right side of history: Israeli president praises
PM Modi stands on right side of history: Israeli president praises

న్యూఢిల్లీః గతేడాది అక్టోబర్ 7న తమ దేశంలో హమాస్ ఉగ్రవాదులు సృష్టించిన నరమేధం అనంతరం ఇజ్రాయెల్‌కు భారత్ అండగా నిలిచిందని ఆ దేశాధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ గుర్తుచేసుకున్నారు. ఇండియా తమకు సంఘీభావంగా నిలిచిందని అన్నారు. ఇక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరిత్రకు సరైన వైపు నిలబడ్డారని ఆయన ప్రశంసించారు. ఇజ్రాయెల్‌కు అండగా నిలబడ్డ మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, ప్రధాని నరేంద్ర మోడీ అంతర్జాతీయ నాయకుడిగా ఎదుగుతున్న తీరుని తాము స్వాగతిస్తున్నామని ఐజాక్ హెర్జోగ్ అన్నారు.

న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో ఇజ్రాయెల్ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా ఐజాక్ హెర్జోగ్ ఈ ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. ఈ మేరకు ప్రత్యేక వీడియోను ఆయన షేర్ చేశారు. ‘‘ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో భారతదేశం ఒకటి. ఇక ఇజ్రాయెల్ ప్రపంచ చిన్న దేశాలలో ఒకటి. అయినప్పటికీ ఈ రెండు ఉమ్మడిగా పంచుకోవడానికి చాలా ఉంది. ఈ రెండూ దృఢమైన ప్రజాస్వామ్య ఆదర్శ సూత్రాలపై ఆవిర్భవించిన ఆధునిక దేశాలు. రెండు దేశాల మధ్య అనేక రంగాల్లో భాగస్వామ్యాలు ఉన్నాయి. వాణిజ్యం సంబంధాల నుంచి సాంస్కృతిక, విద్యా, సాంకేతిక, శాస్త్రీయ రంగాల్లో బంధాలు మరింతగా వృద్ధి చెందుతాయి’’ అని వీడియో సందేశంలో ఐజాక్ హెర్జోగ్ పేర్కొన్నారు.