కేసీఆర్ ఫై ఎలాంటి విమర్శలు చేయకుండానే ప్రసంగాన్ని ముగించిన మోడీ

సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో బిజెపి ప్రజా సంకల్ప సభ ముగిసింది. ఈ సభలో మోడీ టిఆర్ఎస్ ఫై కేసీఆర్ ఫై ఎలాంటి విమర్శలు చేస్తారో అని అంత భావించారు. కానీ మోడీ మాత్రం ఎలాంటి విమర్శలు చేయకుండానే తన ప్రసంగాన్ని ముగించారు. మే నెలలో హైదరాబాద్ కు వచ్చిన మోడీ.. బేగంపేట ఎయిర్ పోర్టులో జరిగిన పార్టీ నేతల సమావేశంలో కేసీఆర్ ఫై , టీఆర్ఎస్ పాలనపై తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రస్తుతం బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ జరుగుతోంది. బీజేపీ జాతీయ కార్యవర్గాల రోజే విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని హైదరాబాద్ కు రప్పించడం, రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు, టీఆర్ఎస్ బ్యానర్లు కట్టడం, ప్రధాని మోడీని సేల్స్ మెన్ తో పోల్చడం, పలు ప్రశ్నలు సంధించి బీజేపీ సభలో మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడం..ఇవన్నీ కేసీఆర్ చేయడం తో ప్రజా సంకల్ప సభ లో మోడీ ఎలాంటి విమర్శలు చేస్తారో వినాలని రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి నేతలు , కార్యకర్తలతో పాటు టిఆర్ఎస్ పార్టీ సైతం ఆసక్తిగా ఎదురుచూసారు.

కానీ మోడీ తన ప్రసంగంలో ఎక్కడ కూడా టిఆర్ ఎస్ పార్టీ ని విమర్శించడం కానీ , కేసీఆర్ పేరును ఎత్తడం కానీ చేయలేదు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏంచేసింది..ఎన్ని నిధులు అందజేసింది..కరోనా సమయంలో ఏంచేసిందనేది లెక్కలతో సహా మోడీ తెలియజేసారు. తెలంగాణ లో డబుల్ ఇంజన్ రాబోతుందని మోడీ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించారని గుర్తు చేశారు. 2019 సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ పుంజుకుంటూ ఉందని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బిజెపి పార్టీ ముందుకు వెళుతూ ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చాలా చేసిందని… తెలంగాణ గడ్డ చైతన్య వంతమైందని తెలిపారు. అంతకు ముందు తన ప్రసంగాన్ని తెలుగులో మొదలుపెట్టి కార్యకర్తల్లో ఉత్సహం నింపారు. ప్రధాని మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. బీజేపీని ఆశీర్వదించేందుకు ఎంతో దూరం నుంచి వచ్చిన సోదరీ సోదరీమణులకు, ప్రతిఒక్కరికీ నా ధన్య వాదాలు అంటూ ప్రధాని ప్రసంగం మొదలుపెట్టారు. తెలంగాణ మొత్తం ప్రజలందరూ ఈ సభకు వచ్చారనిపిస్తుంది. మీరు నా పట్ల చూపిన ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు అన్నారు. తెలంగాణ అభివృద్ధే బీజేపీ ధ్యేయం అన్నారు. తెలంగాణలో కళలు, నైపుణ్యం ఎంతో మెండుగా ఉన్నాయన్నారు.