చంద్రబాబు , లోకేష్ బాబు లకు లీగల్‌ నోటీసులు ఇచ్చిన డీజీపీ

Chandrababu , Lokesh
Chandrababu , Lokesh

తెలుగుదేశం అధినేత చంద్రబాబు , ఆయన తనయుడు లోకేష్ బాబు లకు ఏపీ డీజీపీ షాక్ ఇచ్చారు. గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పెద్ద ఎత్తున పట్టుబడిన హెరాయిన్‌కు ఏపీతో సంబంధం ఉందంటూ ఆరోపణలు చేసిన నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, లోకేశ్, ధూళిపాళ్ల నరేంద్ర, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, బోండా ఉమ, బుద్ధా వెంకన్న, కొమ్మారెడ్డి పట్టాభి కి లీగల్‌ నోటీసులు అందజేశారు. అలాగే ఈ వ్యవహారంపై కథనాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలు, రామోజీరావు, ఆయన కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్, ఉషోదయ పబ్లికేషన్స్, ఈనాడు ఎడిటర్ ఎం.నాగేశ్వరరావుతో పాటు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, అమోద పబ్లికేషన్స్, ప్రింటర్, పబ్లిషర్ కోగంటి వెంకట శేషగిరిరావు, ఆ పత్రిక ఎడిటర్ కె.శ్రీనివాస్, బ్యూరో చీఫ్‌లకు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ లీగల్ నోటీసులు పంపారు.

‘రాష్ట్రంలో జోరుగా డ్రగ్స్‌ రవాణా– గుజరాత్‌లో పట్టుబడ్డ హెరాయిన్‌ సీఎం ఇంటి సమీపంలో సంస్థలదే’, ‘దీనికి సీఎం, డీజీపీ ఏమని సమాధానం చెబుతారు?’, ‘మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై డీజీపీ అవాస్తవాలు’ అనే శీర్షికలతో ఈనాడు పలు కథనాలను ప్రచురించింది. ‘జగన్‌ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి’, డ్రగ్స్‌ మాఫియాకు రాష్ట్రాన్ని నిలయంగా మార్చారు. దీనికి జగన్, డీజీపీ ఏం చెబుతారు?, చంద్రబాబు ధ్వజం’ అనే శీర్షికలతో ఆంధ్రజ్యోతి వార్తలు ప్రచురించింది. నిరాధారమైన ఆరోపణలు చేయడం, వాటిని ప్రచురించడంపై లీగల్‌ నోటీసులు ఇచ్చారు. రాష్ట్ర సర్కారు కు అలాగే పోలీసు శాఖకు క్షమాపణలు చెప్పడంతోపాటు ఆ వార్తను ఆయా పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించాలని నోటీసులో పేర్కొన్నారు. లేనిపక్షంలో వారిపై డీజీపీ న్యాయపరమైన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.